తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలి | ysrcp Telangana Committee Complaint to speakar | Sakshi
Sakshi News home page

తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలి

Published Tue, Jan 27 2015 3:11 AM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలి - Sakshi

తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలి

* స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ఫిర్యాదు
* మీడియా క్లిప్పింగులతో పిటిషన్ సమర్పించిన నేతలు

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), బానోత్ మదన్‌లాల్ (వైరా)లపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట రెండు పిటిషన్లు సమర్పించారు.

ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌కు తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, రైతు విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి వీటిని అందజేశారు. వీరిద్దరూ కూడా వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తుపై అసెంబ్లీకి ఎన్నికై సీఎం కేసీఆర్ సమక్షంలో వేర్వేరు సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. తాము స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతో పదవ షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు.

జనవరి 9న హన్మకొండలో సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సమక్షంలో పార్టీ ఫ్లోర్‌లీడర్ తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. అదేవిధంగా గత సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు సమక్షంలో బానోత్ మదన్‌లాల్ టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. ఇందుకు సంబంధించిన టీవీ చానళ్ల క్లిప్పింగ్‌లు, వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను పిటిషన్లకు జతచేశారు.
 
స్పీకర్ వేటువేయకపోతే న్యాయస్థానానికి..

తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్‌లపై అనర్హత వేటు వేసి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కె.శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి డిమాండ్ చేశారు. తమ పిటిషన్లపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంను ఆదేశించారని వారు తె లిపారు.

లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ వీరిద్దరిపై అనర్హత వేటు వేయని పక్షంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై చర్య తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement