మోగిన నగారా | ZPTC MPTC Election Schedule Released | Sakshi
Sakshi News home page

మోగిన నగారా

Published Sun, Apr 21 2019 10:02 AM | Last Updated on Sun, Apr 21 2019 10:02 AM

ZPTC MPTC Election Schedule Released - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ జారీ చేశారు. జిల్లాలోని 17 జెడ్పీటీసీ స్థానాలకు, 158 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో జిల్లాలోని ఆరు మండలాల జెడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, రెండో విడతలో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు జెడ్పీటీసీ స్థానాలకు, 49 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ విడతలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు, 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

విడతల వారీగా ఎన్నికలు ఈ మండలాల్లోనే...
ఆదిలాబాద్‌ జిల్లాలో మొదటి విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, బేల, భీంపూర్, జైనథ్, మావల, తాంసి మండలాలు ఉండగా, రెండో విడతలో ఐదు మండలాలు ఉన్నాయి. బజార్‌హత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ, తలమడుగు మండలాల్లోని ఆయా స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మూడో విడత ఆరు మండలాల్లోని ఎంపీటీసీ స్థానాలకు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గాదిగూడ, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

848 పీఎస్‌లు.. 3.90 లక్షల ఓటర్లు..
జిల్లాలోని 17 మండలాల పరిధిలో మొత్తం 848 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 నుంచి 600  మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 3,90,882 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొ దటి విడతలోని ఆరు మండలాల్లో 1,28,374 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, రెండో విడతలో 1,24,720 మంది తమ ఓటును స ద్వినియోగం చేసుకోనున్నారు. ఇక ఆఖరు విడతలో 1,37,788 మంది తమ ఓటును వినియోగించనున్నారు. మొదటి విడతలోని 164 లోకేషన్లలో 271 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, రెండో విడతలో 151 లోకేషన్లలో 269 పీఎస్‌లు ఉన్నాయి. ఇక మూడో విడతలో 166 లోకేషన్లకు గాను 308 పో లింగ్‌ కేంద్రాల ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

ఎక్కడికక్కడే ‘పరిషత్‌ ఓట్ల లెక్కింపు’
ఆదిలాబాద్‌అర్బన్‌:  జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోలైన ఓట్లను ఎక్కడివి అక్కడే లెక్కించనున్నారు. నాలుగు జిల్లాల్లో పరిషత్‌ ఎన్నికలు జరుగనున్నందున ఏ జిల్లాలో పోలైన ఓట్లను ఆ జిల్లాల్లోనే లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డిస్ట్రిబ్యూషన్‌ రిసిప్షన్‌ అండ్‌ కౌంటింగ్‌ (డీఆర్‌సీ) కేంద్రాలను గుర్తించారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎన్నికల కమిషన్‌కు సైతం నివేదికలు పంపాలని సంబంధిత అధికారులు తెలిపారు. డీఆర్‌సీ కేంద్రాల గుర్తింపుతో పాటు స్ట్రాంగ్‌ రూంలను కూడా గుర్తించారు. మారుమూల గ్రామాల్లో కూడా పరిషత్‌ ఎన్నికలు జరుగనున్నందున రవాణ సౌకర్యం,

సిబ్బంది ఇబ్బందుల దృష్ట్యా ఆయా జిల్లాల్లో సకల సౌకర్యాలున్న భవనాలను లెక్కింపునకు వినియోగిస్తున్నారు. ఒక లెక్కింపు కేంద్రంలో మూడు నుంచి 8 మండలాల బ్యాలెట్‌ బాక్సులను కౌంట్‌ చేయనున్నారు. పంపిణీ, లెక్కింపు కేంద్రాలు, లెక్కింపు హాలులు, స్ట్రాంగ్‌ రూంలను విడివిడిగా గుర్తించారు. ఇదివరకే డీఆర్‌సీ, స్ట్రాంగ్‌రూంల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసిన అధికారులు అందులో సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. లెక్కింపు రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, సమస్యలూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement