ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల కావడంతో పరిషత్ ప్రక్రియ ఊపందుకుంది. జిల్లాలోని ప్రాదేశిక నియోజకవర్గాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా, మొదటి దశలో ఆరు, రెండో దశలో ఐదు, చివరి విడతలో ఆరు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేష్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ముందుగా మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 26 నుంచి రెండో దశ పరిషత్ ప్రక్రియ మొదలు కానుంది.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. పరిషత్ పోరులో భాగంగా
మొదటి విడతలో ఆదిలాబాద్, మావల, జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల్లోని 6 జెడ్పీటీసీ స్థానాలకు, 51 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఒకేచోట ప్రక్రియ జరుగనుంది. అయితే ఒక జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, మూడు లేదా నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారిని నియమించి సిద్ధంగా ఉంచారు.
వీరు మండల పరిషత్ కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ బుధవారం వరకు కొనసాగనుంది. అంటే మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించి ఈ నెల 25న పరిశీలన చేస్తారు. అదే రోజు సాయంత్రం అర్హత అభ్యర్థుల నామినేషన్లను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో తిరస్కరణకు గురైన వాటిపై అప్పీలు చేసుకునేందుకు ఈ నెల 26 వరకు గడువుంది. తిరస్కరణకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 27న ప్రకటిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 28 వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. కాగా ఈ ఆరు మండలాలకు మే 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment