1.5 కి.మీ. సొరంగం తవ్వి జైలు నుంచి పరారీ!
మెక్సికో: మెక్సికో మాదక ద్రవ్యాల వ్యాపార చీకటి సామ్రాజ్యానికి అధినేత(డ్రగ్‌లార్డ్) జోయాక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్‌మాన్(58) మళ్లీ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు గది కిందుగా ఏకంగా 1.7 మీటర్ల వెడల్పుతో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వి అతడు దాని ద్వారా పరారయ్యాడు! నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఆ సొరంగం తెరుచుకుని ఉంది.
మెక్సికో సిటీకి 90 కి.మీ. దూరంలోని ఆల్టిప్లానో జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా శనివారం రాత్రి అందరి కళ్లుగప్పి అతడు అదృశ్యమయ్యాడు. ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారడంతో గుజ్‌మాన్ కోసం మెక్సికన్ పోలీసులు, సైనికులు భారీ స్థాయిలో గాలింపు జరుపుతున్నారు. గుజ్‌మాన్ జైలు నుంచి తప్పించుకోవడం 14 ఏళ్లలో ఇది రెండోసారి.