పీఎఫ్ ఎగ్గొడుతున్న పదివేలకుపైగా కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు పదివేల కంపెనీలు ఉద్యోగులు పీఎఫ్ సొమ్మును మింగేస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగుల జీతంనుంచి కట్ చేస్తున్న సొమ్మును జమ చేయకుండా మింగేస్తున్న కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ కంపెనీలు అన్న తేడా లేకుండా కొన్ని ప్రధానమైన సంస్థలు కూడా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తేలింది.
2014-15లో 10,091 కంపెనీలు డిఫాల్టర్లుగా ఉంటే.. 2015 డిశెంబర్ నాటికి ఈ సంఖ్య 10,932 కు పెరిగింది. దాదాపు 22వందలకు పైగా కంపెనీలు 22వందల కోట్లకు పైగా ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్మును ఈపీఎఫ్ఒ ఖాతాల్లో జమ చేయడంలేదు. దీనికి సంబంధించి తమకు వేలకొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయని, ఈపీఎఫ్వో అధికారులు, యజమాన్యాలు కుమ్మక్కవుతున్నాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సెక్రటరీ, ఈపీఎఫ్ఓ ట్రస్టీ డీఎల్ సచ్దేవ్ విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఈపీఎఫ్వో సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ కు ఒక వివరణాత్మక ప్రశ్నాపత్నాన్ని పంపించినా సమాధానం లేదని ఆరోపించారు.
అయితే తమిళనాడులో 2644, మహారాష్ట్రలో 1692, కేరళ, లక్షద్వీప్ తో కలిపి 1118 సంస్థలు ఉద్యోగుల పీఎఫ్ డిఫాల్టర్స్ గా తేలాయని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 192 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది. 2015-16 సం.రంలో పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ ఫిర్యాదుల సంఖ్య గత సంవత్సరం కంటే 23 శాతం పెరిగింది. 228 పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 2014-15లో రూ 3,240 కోట్ల రుణాలు చెల్లించలేదనే ఆరోపణలతో నమోదైన 14,000 కేసులు విచారణలోఉన్నాయి.
కాగా ఒడిశా కు చెందిన సంజయ కుమార్ (27) తన తండ్రి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి రూ .40,000 లు డ్రా చేయాలనుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం 30 రోజుల తరువాత రావాల్సిన పీఎఫ్ సొమ్ము 1,825 రోజులు గడిచిపోయినా చేతికందలేదు. ఇంతలో కుమార్ తండ్రి కృష్ణ చంద్ర (53) 2011 లో మరణించారు. పిఎఫ్ డబ్బును డ్రా చేయడంలో తనకు సహాయం చేయమనీ, ఈ విషయంలో తన తల్లి ఆందోళన చెందుతున్నారంటూ ఆన్ లైన్ ఫోరమ్ లో సంజయ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి.