న్యూఢిల్లీ: దేశంలోని ఇత ర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజధాని ఢిల్లీ నేరగాళ్లకు అడ్డాగా మారుతోందని, మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 129 మంది నేరగాళ్లు పోటీలో ఉన్నారని అధ్యయనాలు ఢంకా బజాయిస్తున్నాయి. 2008తో పోల్చుకుంటే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న నేరగాళ్ల సంఖ్య 14 నుంచి 16 శాతానికి పెరిగిందని పేర్కొంటున్నాయి. ఈ మేరకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్(డీఈడబ్ల్యు)లు బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్‌ల ఆధారంగా వెల్లడించాయి.
వీటి కథనం మేరకు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీలకు చెందిన మొత్తం 796 మంది అభ్యర్థుల్లో 129 మంది వివిధ కేసులు ఎదుర్కొంటుండగా 93మందిపై హత్య, దొమ్మీ, మహిళలపై వేధింపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి రంగంలోకి దిగిన అభ్యర్థుల్లో 46 మంది ఈ జాబితాలో ఉండగా, బీఎస్పీ నుంచి 14, చిన్నా చితక పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు 64 మంది ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ అభ్యర్థుల్లో ఐదుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని అధ్యయనం బట్టబయలు చేసింది.