హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలింది..!
పది అంతస్తుల హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలిపోయింది. జపాన్ ఒకసా లోని ఓ పాఠశాలలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన అర్థంతరంగా నేల ఒరిగింది. 150 మంది విద్యార్థులతో నిర్మించిన పిరమిడ్ ఒక్కసారిగా నేల కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జెండా ఎగుర వేసేందుకు అందరికంటే పైకి ఎక్కిన విద్యార్థి తన పని పూర్తి కూడా చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి అతడు జారిపోవడంతో మొత్తం ప్రదర్శన కకావికలమైపోయింది.
జపాన్ లోని ఒసాకా.. యో సిటీ లోని జూనియర్ హైస్కూలు విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా ఒకరిపై ఒకరు ఎక్కుతూ పది అంతస్తులుగా.. ఓ పిరమిడ్ రూపాన్నినిర్మించారు. ఇటువంటి గ్రూప్ ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి ఎంతో గట్టి నమ్మకం ఉండాలి. అప్పటికీ పైన ఎక్కిన విద్యార్థి తాను జెండా ఎగురవేసేందుకు నిలబడుతున్నానని ఒకటికి రెండుసార్లు అందర్నీ హెచ్చరిస్తూనే ఉన్నాడు.
అంతా కలిపి చేయాల్సిన పనిలో ఏ ఒక్కరు పరధ్యాన్నంగా ఉన్నా మొత్తం కొలాప్స్ అవ్వడం ఖాయం. అక్కడ అదే జరిగింది. పైకెక్కిన విద్యార్థి చివరి అడుగును పైకి వేసేలోపు కింది వరుసలో నిలబడ్డ వారిలో కదలికలు రావడంతో అంతా ఒక్కసారి కుప్ప కూలిపోయారు. ఆ హఠాత్ పరిణామం అక్కడ ప్రదర్శనను చూస్తూ ఉన్న మిగిలిన విద్యార్థులను షాక్ కు గురి చేసింది. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒక విద్యార్థికి మాత్రం చెయ్యి కూడ విరిగిపోయింది.
హ్యూమన్ పిరమిడ్స్ తో గాయాలవ్వడం జపాన్ లో కొత్తేమీ కాదు. 2012 లో 6,500 మందికి గాయాలవ్వడం ఓ రికార్డుగా మారింది. అప్పట్లో ఒక విద్యార్థికి పెర్మనెంట్ స్పైనల్ డ్యామేజ్ కూడ అయ్యింది. ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా జపాన్ ప్రజలు ఆ ప్రదర్శనను ఎంతో గర్వంగా ఫీలౌతారు. ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల ప్రదర్శనల్లో మానవ పిరమిడ్ నిర్మించడం అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది.