20 ఎకరాల్లో టౌన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: తక్షణ అవసరాలైన సర్కారు కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కోసం 20 ఎకరాల్లో అమరావతి టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టాలని కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రైవేట్ సంస్థతో సంయుక్త డెవలపర్ విధానంలో నిర్మాణాలను చేపట్టాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. సంయుక్త డెవలపర్ విధానంలో ఆ 20 ఎకరాలను ప్రైవేట్ సంస్థకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని, ఇందులో సీఆర్‌డీఏకు కొద్దిపాటి వాటా ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
తక్షణం నూతన రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటే వీలైనంత త్వరగా అమరావతి నుంచే పరిపాలన సాగాలని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ శాఖలు, వాటిల్లోని ఉద్యోగులను అమరావతికి తరలించాలని సీఆర్‌డీఏ పేర్కొంది. ఉద్యోగులను తరలించాలంటే కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాల, వాణిజ్య కార్యకలాపాలకోసం నిర్మాణాలు చేయాల్సి ఉందని సీఆర్‌డీఏ తెలిపింది. ఇందుకు ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలను పంపించింది.
20 ఎకరాల్లో సీఆర్‌డీఏ కోసం ఆ ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను సంయుక్త డెవలపర్‌గా ఉండే ప్రైవేట్ సంస్థ చేపడతుంది. దానికి ప్రతిఫలంగా ఆ ప్రైవేట్ సంస్థకు 10 ఎకరాల్లోని డెవలప్‌మెంట్‌ను విక్రయించుకునే హక్కు ఇవ్వనున్నారు. అయితే 99 సంవత్సరాల పాటు లీజు విధానంలోనే ఆ విక్రయాలు ఉండాలనే నిబంధన విధించనున్నారు. లేదంటే సీఆర్‌డీఏకు అవసరమైన నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు సొంత నిధులనే వెచ్చించడం.
ఇక మూడో ప్రతిపాదనగా.. సంయుక్త డెవలపర్ విధానంలోనే ఆ 20 ఎకరాలను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ ప్రైవేట్ డెవలపర్‌ను ఎంపిక చేయడం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. తక్షణ అవసరాల కోసం నిర్మించే ఆ భవంతుల్లో 10 వేల మంది ఉద్యోగుల పనిచేయడానికి వీలు కలుగుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది.