24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు | 24 Hyderabad students go missing in Himachal river | Sakshi
Sakshi News home page

24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

Published Mon, Jun 9 2014 2:21 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు - Sakshi

24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

స్టడీ టూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు
లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో ఒక్కసారిగా
గేట్లు ఎత్తివేయడంతో పెరిగిన ప్రవాహ ఉధృతి
కొట్టుకుపోయిన విద్యార్థులు.. గల్లంతైన  వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు
 సహాయక చర్యల్లో హిమాచల్ అధికారులు,తెలంగాణ డీజీపీ పర్యవేక్షణ.. కంట్రోల్ రూం ఏర్పాటు
నేడు ఘటనాస్థలికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి  ప్రవాహంలో రాష్ట్రానికి  చెందిన 24 మంది  విద్యార్థులు కొట్టుకుపోయారు. అప్పటివరకు ఉల్లాసంగా.. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ, ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభించాయని మండి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.
 
 వివరాల్లోకి వెళితే.. ఈనెల 3న హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న 48 మంది విద్యార్థులు స్టడీటూర్‌కు వెళ్లారు. వారితో పాటు ముగ్గురు లెక్చరర్లు, ఒక లెక్చరర్ కుమారుడు కూడా ఉన్నారు. టూర్‌లో భాగంగా ఢిల్లీ, ఆగ్రా, ఉదంపూర్, సిమ్లాల్లో పర్యటించారు. అనంతరం ఆదివారం సాయంత్రం మండి జిల్లాలోని లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు(తలోట్ గ్రామం) వద్దకు చేరుకున్నారు. డ్యామ్ గేట్ల సమీపంలోవిద్యార్థులు ఫొటో దిగుతున్న సమయంలో ఎలాంటి సమాచారం, హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా డ్యామ్ గేట్లను ఎత్తారు. దాంతో ఒక్కసారిగా పెరిగిన నది ప్రవాహంలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షి, తప్పిపోయిన విద్యార్థుల సహచర విద్యార్థిని అయిన దివ్య ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. సాయంత్రం 6.00-6.20 సమయంలో ప్రమాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 18 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు ఉన్నట్లు తెలిసింది. విద్యార్థులతో పాటు వెళ్లిన లెక్చరర్లు ఆదిత్య కశ్యప్, కిరణ్, సుమబాల సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది.
 
 రంగంలోకి గజ ఈతగాళ్లు: మండీ ఎస్పీ
 
 డ్యామ్ గేట్లు తెరవడంతో అత్యంత వేగంతో నీటి ప్రవాహం కిందకు వెళ్తుందని, ఆ ప్రవాహం 35 కిలోమీటర్ల దూరంలోని పాంథా ప్రాజెక్టు వరకు సాగుతుందని మండీ జిల్లా ఎస్పీ ఆర్‌ఎస్ నేగీ వివరించారు. అందువల్ల గల్లంతైన విద్యార్థుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉంటారనేది చెప్పలేమన్నారు. గల్లంతైన వారిలో చాలామంది పాంథా
 
 
 పాజెక్టులోనే లభించే అవకాశం ఉందన్నారు. సమాచారం అందగానే ఇరవైమంది గజ ఈతగాళ్లు, పదిమంది బోట్ డ్రైవర్స్‌తో సహాయక చర్యలు ప్రారంభించామని, అయితే, చీకటి కావడంతో ఆదివారం రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, ఇప్పటివరకు మృతదేహాలేవీ లభించలేదన్నారు. మరోవైపు, 10 మృతదేహాలు లభించినట్లు తమకు సమాచారం ఉందని మండి  జిల్లా  పోలీసుకంట్రోల్‌రూమ్ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా, మనాలి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన  చోటుచేసుకుం దని  హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ  రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రెండు బస్సుల్లో విహార యాత్రకు హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారని తెలిపారు. పార్వతి, బియాస్ నదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ డ్యామ్‌లోనికి దిగి  విద్యార్థులు  స్నానాలు చేస్తూ, ఈతలు కొడుతూ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేశారని, దాంతో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహ ఉధృతిలో కొంచెం లోతున ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కొట్టుకుపోయారని ఆయన వెల్లడించారు.
 ఘటనాస్థలానికి హోంమంత్రి: ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోంమంత్రి నాయిని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సోమవారం ఉదయమే రెవిన్యూ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరి  బిఆర్ మీనా, గ్రేహౌండ్స్  ఎస్‌పి  కార్తికేయలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ఘటనా స్థలానికి  వెళ్తున్నామన్నారు.  రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ  అక్కడి డీజీపీ, మండి ఎస్‌పితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం: మర్రి


 ప్రమాదస్థలికి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందం బయలుదేరి వెళ్లిందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లోని బతింద నుంచి 45 మంది రిస్క్యూ టీమ్ సభ్యులతో పాటు 4 పడవలు, గజ ఈతగాళ్లు బయలుదేరి వెళ్లారన్నారు. సోమవారం ఉదయానికి వీరు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతారని వివరించారు. 


 సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం: డీజీపీ  


 రాష్ట్ర విద్యార్థుల గల్లంతు సమాచారం తెలియగానే అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడానని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విద్యార్థులో సురక్షితంగా ఉన్నవారి నుంచి సమాచారాన్ని తీసుకుని మిగతావారి జాడ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.  కాగా, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కూడిన ప్రత్యేక పోలీసు బృందం సోమవారం ఉదయం ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్తోందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.  


 విద్యార్థుల కుటుంబాల్లో భయాందోళనలు


 హిమాచల్ ప్రదేశ్‌లోని లాల్జీ డ్యామ్ ప్రమాద ఘటనతో విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ పిల్లల నుంచి క్షేమసమాచారం అందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ పిల్లల క్షేమ సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు.


 షాక్‌లో మిగతా విద్యార్థులు..


 విజ్ఞానయాత్రకు వెళ్లిన విద్యార్థుల్లో 24 మంది ఒకేసారి గల్లంతవడంతో మిగిలిన విద్యార్థులు, లెక్చరర్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహచర విద్యార్థులు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగిలిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.
 
 ముందస్తు హెచ్చరికలు లేకుండానే..
 
 ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, సమీప ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయకుండానే లార్జి డ్యామ్ గేట్లను ఎత్తివేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని జ్యూరీ ప్రాంతంలోని హైడ్రో పవర్ స్టేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న నగర వాసి మధు.. ప్రమాదానికి కారణాలు ఇవి కావచ్చని ‘సాక్షి’కి వివరించారు.
 
 హైడ్రో పవర్‌స్టేషన్‌లో స్వల్ప పేలుడు సంభవించినపుడు కూడా తక్షణం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది.
 
 డ్యామ్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో అత్యధికమైతే తక్షణం గేట్లు ఎత్తి అధికంగా వచ్చి పడుతున్న నీటిని బయటికి పంపుతారు.
 
 వాకీటాకీల ద్వారా డ్యామ్‌కు సమీపంలో మూడు కిలోమీటర్ల వరకు సమీప ప్రాంత వాసులను హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు లేదు.
 
 గేట్లుఎత్తే సమయంలో పెద్ద సైరన్ మోగించాల్సి ఉంటుంది. సైరన్ మోగించారా..లేదా చిన్నగా వినిపించిన శబ్దాన్ని విద్యార్థులు పరిగణలోకి తీసుకోలేదా అన్నది అనుమానాస్పదంగా మారింది.
 
 బాధిత విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం నెంబర్లు 040-23202813 మరియు 9440815887. అలాగే హిమాచల్‌లోని హెల్ప్‌లైన్ నెంబర్ ల్యాండ్‌ఫోన్  1902-224455.
 
 లార్జీ డ్యామ్ వివరాలు: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని బియాస్ నదిపై లార్జీ డ్యామ్ నిర్మాణం 2006లో పూర్తయ్యింది. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ డ్యామ్ ఎత్తు 26.5 మీటర్లుగా ఉంది. ఇక్కడ పవర్‌హౌజ్, విశాలమైన రిజర్వాయర్‌లున్నాయి.
 
 ఒక్కసారిగా నీటి ప్రవాహం ముంచెత్తింది
 సాక్షితో  ప్రత్యక్ష సాక్షి సద్ది దివ్య


 సాక్షి, హైదరాబాద్: డ్యామ్ కింది భాగంలో తోటి విద్యార్థులు ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం రావడంతో కొట్టుకుపోయారని విజ్ఞానజ్యోతి కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న దివ్య ‘సాక్షి’తో ఫోన్‌లో తన బాధను పంచుకున్నారు. ఆ దృశ్యాలు తన కళ్లముందే కదలాడుతున్నాయన్నారు. తోటి విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోవడంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు  తామంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరామని ఆమె తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని హైదరాబాద్‌లోని తన తండ్రి రవిందర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశానని చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement