మండి : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లను అందచేసింది. అకస్మాత్తుగా నదిలో నీరు పెరగటం వల్లే విద్యార్థులు కొట్టుకుపోయారని హిమాచల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను అందచేసింది.
మృతదేహాలు లభ్యమైతే హైదరాబాద్కు తరలిస్తామని హిమాచల్ ప్రభుత్వ అధికారులు...విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. గత పదిరోజులుగా జరిగిన గాలింపు చర్యల్లో తమ పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. విద్యార్థుల గల్లంతుపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించనున్నారు.
కాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముమ్మర గాలింపులు బియాస్‌నదిలో గల్లంతైన విద్యార్థుల మతదేహాలను వెలికితీయడంలో విఫలమయ్యాయి. భారీ స్థాయిలో గాలింపు చర్యలు జరిగినప్పటికీ ఒక్క మతదేహం కూడా బయటపడలేదు. సైడ్ సోనార్ పరికరాలు, మానవ రహిత విమానాలు ఉపయోగించినా, నీటి విడుదలను పూర్తిగా ఆపివేసి సంఘటనాస్థలంలో గజ ఈతగాళ్లు విస్తతంగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. 24మంది గల్లంతు కాగా కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది.