
గ్యాస్ సిలిండర్ పేలి 25 మంది మృతి!
మధ్యప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. జబూవా జిల్లా కేంద్రంలోని ఒక రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ లీకై పేలిపోయింది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 25 మందికిపైగా చనిపోయినట్లు, మరో 80 మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో పేలుడు జరగటంతో... మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది.
దీంతో హోటల్ లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ భవనం కూలి పక్కనే ఉన్న భవనాలపై పడటంతో.. రెండు భవనాలు కూడా ఒరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.