25 ఏళ్లు పూర్తయిన విద్యుత్ ప్లాంట్లు మార్పు
న్యూఢిల్లీ: దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వాటన్నిటినీ మార్చనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిని అధునాతనమైన, పర్యవరణ హితమైన విద్యుత్ ప్లాంట్లుగా అభివద్ధి చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన సమస్యలకు ఆయన సమాధానం ఇస్తూ.. తరచు బ్రేక్‌డౌన్లకు గురికావడం, సక్రమంగా పనిచేయకవపోడం, కాలుష్యం తదితర కారణాలతో 25 ఏళ్లు పూర్తయిన పవర్ ప్లాంట్లను మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినకుండా దశల వారీగా ఈ ప్లాంట్లను మార్పు చేస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్ల మార్పునకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు.
విద్యుత్ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చామని, ఈ రంగంలో పెట్టుబడుల పెరుగుదలను ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగం వరకూ తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూలై 30 నాటికి 46 థర్మల్ పవర్ ప్లాంట్లలో ఏడు రోజుల కంటే తక్కువ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని, వీటిలో 23 ప్లాంట్లలో 4 రోజులకు సరిపడ నిల్వలే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.