27 ఏళ్ల తర్వాత రూ.2 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం కేసు ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అన్ని చోట్లా బాధితుడికే తీర్పు అనుకూలంగా వచ్చినా.. పరిహారం ఇచ్చేందుకు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ నిరాకరిస్తూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుకు రాజస్థాన్ కార్పొరేషన్ తలవంచక తప్పలేదు. దాదాపు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 27 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అమెరికా సిటిజన్ విజయం సాధించారు. వివరాలిలా ఉన్నాయి.
అమెరికాకు చెందిన అలెగ్జిక్స్ సోనియెర్ 1988లో 'పీస్ మార్చ్'లో పాల్గొనేందుకు భారత్ వచ్చాడు. ఇతర కార్యకర్తలతో కలసి సోనియెర్ ఓ వాహనంలో వెళ్తుండగా.. జైపూర్ సమీపంలో రాజస్థాన్ కార్పొరేషన్కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోనియెర్ కోమాలోకి వెళ్లారు. రాజస్థాన్, గుజరాత్లలో అతనికి చికిత్స చేయించినా కోమాలోంచి బయటకు రాలేదు. చికిత్స కోసం అతణ్ని అహ్మదాబాద్ నుంచి అమెరికాకు తరలించారు.
తమకు 2 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా బాధితుడి తల్లి డొమినిక్వె సోనియెర్ రాజస్థాన్ రోడ్డు యాక్సిడెంట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. 6శాతం వడ్డీతో 1.25 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రిబ్యునల్ రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కార్పొరేషన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పరిహార మొత్తాన్ని కోటి రూపాయలకు తగ్గించింది. అయితే కార్పొరేషన్ పరిహారం చెల్లించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ పిటిషన్ను కొట్టివేస్తూ బాధితుడికి 1.17 కోట్ల రూపాయల పరిహారం పాటు 6 శాతం వడ్డీ (కేసు దాఖలు చేసిన తేదీ నుంచి) చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్కే అగర్వాల్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పరిహారం, వడ్డీ కలిపితే దాదాపు 2 కోట్లకు పైగా అవుతుంది.