ఆ అధ్యక్షుడికి నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టెకి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. గుర్తింపు కోసమే కామెంట్లు చేస్తారనే వాదనలు ఉన్నాయి.
డుటెర్టె-వివాదాలు
గ్యాంగ్ రేప్ జోక్
అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డుటెర్టె.. గుర్తింపు కోసం వాషింగ్టన్ పోస్టులో వచ్చిన ఓ రేప్ కథనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1989లో ఆస్ట్రేలియా న్యాయశాఖ మంత్రి జాక్వెలిన్ హమిల్ ను దారుణంగా రేప్ చేసి, చంపారని ఆ కథనం. దవావో జైలులో జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది మరణించారు. దీనిపై స్పందించిన డుటెర్టె మృతుల శవాలను బయటకు తెచ్చిన తర్వాత తాను స్వయంగా చూశానని చెప్పారు.
రేప్ కు గురైన ఆమె ముఖాన్ని కూడా చూశానని చెప్పారు. ఆమె చాలా అందంగా ఉందని, అచ్చం అమెరికన్ నటిలా ఉందని జోక్ చేశారు. ఆమె రేప్ కావడం తనకు కోపం తెప్పించిందని.. వృథాగా ఓ అందమైన యువతి చనిపోయిందని అయిందని వివాదాస్పదంగా మాట్లాడారు. డుటెర్టెపై నెటీజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పోప్ ఫ్రాన్సిస్ నూ వదల్లేదు
అధ్యక్ష పదవి అభ్యర్ధిగా అధికారిక ప్రకటన కార్యక్రమానికి ఆలస్యంగా రావడంపై డుటెర్టె పోప్ ఫ్రాన్సిన్స్ ను కారణంగా చూపుతూ దురుసుగా మాట్లాడారు. మనిలాలో పోప్ మీటింగ్ కారణంగా ట్రాఫిక్ జాం అయిందని సభలో చెప్పారు. పోప్ ను ఉద్దేశించి జోక్ చేశారు. పోప్ ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. మీ ప్రాంతానికి వెళ్లిపోండి. ఇంకెప్పుడూ ఇటువైపు రావొద్దంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తాను పోప్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ట్రాఫిక్ జాం అయిందని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ కోరనని తేల్చిచెప్పారు.
మానవహక్కుల ఉల్లంఘన
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డుటెర్టె డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎంతలా అంటే దేశంలో ఉన్న ప్రతి ఇంటిని సోదా చేయించి.. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని చంపించారు. డ్రగ్స్ కారణంతో డుటెర్టె చంపించిన వారి సంఖ్య 2వేలకు పైమాటే. డ్రగ్స్ కేసుల్లో మానవహక్కుల ఉల్లంఘనపై మాట్లాడిన ఆ విషయంలో తాను ఎవరిని లెక్కచేయనని వ్యాఖ్యానించారు. దీంతో మానవహక్కుల కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.
దక్షిణ చైనా సముద్రం
దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ కోర్టు తీర్పు తర్వాత డుటెర్టె దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద భూభాగంలో తాను జెట్ లో విహరించాడానికి సిద్దంగా ఉన్నానని కూడా కామెంట్ చేశారు. అక్కడితో ఆగని డుటెర్టె ఫిలిప్పీన్స్ జెండాను కూడా ఆ ప్రాంతంలో ఎగురవేస్తానని ప్రకటించారు.
యూఎన్ చీఫ్ కు షాక్
ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశానికి డుటెర్టె నో చెప్పి మరోసారి వార్తలకెక్కారు. యూఎన్ ఫీలిప్పీన్స్ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటంతోనే మూన్ ని కలవడానికి డుటెర్టె ససేమీరా అన్నట్లు అక్కడి పత్రికలు రాశాయి. ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి బూతులు కూడా మాట్లాడినట్లు అక్కడ పత్రికలు ప్రచురించాయి. తక్షణమే స్పందించిన యూఎన్.. సభ్యత్వ దేశాల జాబితా నుంచి ఫిలిప్పీన్స్ తప్పిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో వెనక్కు తగ్గిన డుటెర్టె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.