ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. జీతం తక్కువే. పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసే అవకాశం లేదు. అయినా సరే ఉన్నంతలో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఇపుడదే ఆయన్ను కాపాడుతోంది. ఒకదశలో ఇన్వెస్ట్‌మెంట్ మానేసినా కూడా... జీవితాంతం తరగని నిధిలా పింఛన్ మాదిరి డబ్బు చేతికొచ్చే అవకాశం కూడా ఆయనకు కలిగింది. ఆ ఇన్వెస్టర్ కథనం... ఆయన మాటల్లోనే.
‘‘నా పేరు మల్లిఖార్జున్ గౌడ్. ఉండేది హైదరాబాద్‌లో. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. డబ్బు పొదుపు చేయటంపై బాగా ఆలోచించాక... 1995లో ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ పథకాన్ని ఎంచుకున్నా. ప్రతి నెలా రూ.3,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో ఇన్వెస్ట్ చేశాను. ఇలా మొత్తం పది సంవత్సరాలు అంటే 2005 వరకు ఈ పథకంలో మొత్తం రూ.3.60 లక్షలు ఇన్వెస్ట్ చేశాను.
ఈ పదేళ్లలో నా పెట్టుబడి విలువ రూ.11.91 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 23% వార్షిక రాబడి పొందాను. ఇక చాల్లే... రాబడి బాగానే వచ్చింది కాబట్టి మొత్తాన్ని విత్ డ్రా చేసుకుందామనుకున్నాను. కానీ అదే సమయంలో నా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ పి.సతీష్ నాకొక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. డబ్బు మొత్తం ఒకేసారి తీసేయకుండా... ప్రతి నెలా పింఛన్ మాదిరి కొంత మొత్తాన్ని తీసుకోమన్నాడు. అలా చేస్తే మిగిలిన డబ్బు పెరుగుతూ ఉంటుందని, జీవితాంతం తరగని నిధిలా ఉంటుందని చెప్పాడు. ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇన్వెస్ట్ చేశారు కనక ఇప్పుడు ప్రతి నెలా రూ.6,000 చొప్పున వెనక్కి తీసుకోమని సూచించాడు. ఆ ఏడాదే నేను హౌసింగ్ లోన్ తీసుకొని ఇంటిని కట్టుకోవడంతో జీతం డబ్బులు చాలేవి కావు. దీంతో రెండో జీతంలా ఉండటమే కాకుండా ఈఎంఐ భారం దాదాపు సగం తగ్గిపోతోందన్న భావనతో సరే అన్నాను. ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రతి నెలా రూ.6,000 చొప్పున తీసుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేసింది మొత్తం రూ.3.60 లక్షలు అయితే ఇప్పటి వరకు నేను రూ.4.98 లక్షలు తీసేసుకున్నాను.
కాని ఇప్పటికీ నా ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏ మాత్రం తగ్గలేదు. సరికదా భారీగా పెరిగింది. ప్రస్తుతం నా ఫండ్ విలువ రూ.34.17 లక్షలుగా ఉంది. అంటే ఇప్పటికే తీసుకున్న మొత్తంతో కలిపితే నా ఇన్వెస్ట్‌మెంట్ విలువ దాదాపు రూ.40 లక్షలు దాటినట్లు. ఈ 18 ఏళ్లలో చూస్తే నా పెట్టుబడిపై సగటున 17 శాతం వార్షిక రాబడిని పొందినట్లు లెక్క. ఈ మధ్యకాలంలో అన్ని ధరలు బాగా పెరిగిపోవడంతో నెలవారీ బడ్జెట్ నిర్వహణ కాస్త కష్టంగా ఉం టోంది. దీంతో వచ్చే నెల నుంచి నేను ప్రతి నెలా రూ.10 వేలు తీసుకోవా లనుకుంటున్నాను. ఇలా తీసుకున్నా... నేను జీవించినంత కాలం ఇలా పెన్షన్ కింద వస్తుందనే భావిస్తున్నా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేశాక ఇలా నెలనెలా వెనక్కి తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంది.
- పి.మల్లిఖార్జున్ గౌడ్, హైదరాబాద్
ఇపుడైతే రెండో జీతం-రిటైరైతే అదే పింఛన్!
Published Sun, Aug 25 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement