న్యూఢిల్లీ: తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపే భారీ ఎత్తున సమ్మె నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీసీ, ఏబబీఓఏ,బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈ ఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యు, ఎన్‌ఓబీఓ యూనిమయన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్ మెంట్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, పాత తరం ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులుఈ సమ్మెలో పాల్గొననున్నాయి. మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు బ్యాంకు సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి. అయితే జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం, జాతీయ బ్యాంకు అధికారుల సంఘాలు మాత్రం సమ్మెలో పాల్గొనట్లేదు.
ఫిబ్రవరి 21న భారత బ్యాంకుల సమాఖ్య(ఐబిఎ)తో జరిపిన చర్చలు విఫలమైనట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(ఎఐబిఇఎ) ప్రకటించింది. సమ్మె యథావిధిగా కొనసాగుతందని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఆదివారం మీడియాకు చెప్పారు.
కేంద్రం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలపై కూడా బ్యాంకు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సంఘాలు ప్రభుత్వం ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నాయి. ముఖ్యంగ గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీమానిటైజేషన్ కాలంలో అదనంగా పనిచేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు మంగళవారం వివిధ యూనియన్ల ఆద్వర్యంలో సమ్మెను చేపట్టనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు కొన్ని ఇప్పటికే వినియోగదారులకు సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా సమ్మె కారణంగా తమ బ్యాంక్ కార్యకలాపాలకు, సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ముందస్తు సూచనలను అందించాయి.