మోసానికి ఇదో సరికొత్త దారి..!
పంజగుట్ట: నకిలీ ఐడీప్రూఫ్‌లతో పలు ఎలక్ట్రానిక్ సంస్థల నుంచి ఖరీదైన టీవీలు వాయిదా పద్ధతిలో తీసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 65 లక్షలు విలువచేసే 9 ఎల్‌ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సింహాద్రి సాయికిరణ్ అలియాస్ వెంకట సాయి కిరణ్ (24) కొన్నేళ్లుగా వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి కర్మన్‌ఘాట్‌కు చెందిన ఆర్టీఏ ఏజెంట్ వి.యాదగిరి (32), కంచన్‌బాగ్ హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ప్లంబర్ మహ్మద్ అబ్దుల్ వాసి (46), ఉప్పల్ శంకర్ నగర్‌కు చెందిన కాదరి నాగభూషణం (36) స్నేహితులు. విలాసాలకు పాల్పడిన వీరంతా డబ్బు తేలిగ్గా సంపాదించేందుకు మోసాలను వృత్తిగా ఎంచుకున్నారు. వీరు నకిలీ ఐడీప్రూఫ్‌లు తయారు చేసి నగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలలో వాయిదాల్లో ఖరీదైన ఎల్‌ఈడీ టీవీలు తీసుకునేవారు. వీరికి సదరు షోరూంలలో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు పూర్తిగా సహకరించేవారు.
అంతేకాకుండా, ఎల్‌బీ నగర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా పనిచేసే నరేష్‌తో పరిచయం చేసుకుని వివిధ ఐడీ ప్రూఫ్‌లు సంపాదించారు. సంపాదించిన ఐడీప్రూఫ్‌లు, నకిలీ అడ్రస్‌లతో ఖరీదైన ఎల్‌ఈడీలు తీసుకుంటారు. రిలయన్స్ డిజిటల్‌లో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మహేష్, రాహుల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో మేనేజర్లుగా పనిచేసే వెంకటనారాయణ, హేమంత్ కుమార్, డెలివరీ చేసే ఆటోట్రాలీ డ్రై వర్లు అశోక్, ఆరోగ్యంలు వీరికి పూర్తి సహకారం అందిస్తారు.
వీరు టీవీలు తీసుకోగానే బజాజ్ ఎలక్ట్రానిక్‌లో మేనేజర్లుగా పనిచేసే వెంకటనారాయణ, హేమంత్ కుమార్‌లు 60 శాతం పేమెంట్ ఇచ్చి తిరిగి వారే టీవీలు తీసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారు. బుధవారం ఖైరతాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయి కిరణ్, యాదగిరి, అబ్దుల్ వాసి, నాగభూషణంలను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని విచారించగా దొంగతనాల చిట్టావిప్పారు. దీంతో వారిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 9 ఎల్‌ఈడీ టీవీలను స్వాధీనం చేసుకుని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. వీరికి సహకరించిన సేల్స్‌మెన్, మేనేజర్‌లు, ఆటోట్రాలీ డ్రైై వర్లు, నకిలీ ఐడీ ఫ్రూఫ్‌లు ఇచ్చిన నరేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.