
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదివారం బాగా కలిసొచ్చింది. దేశ రాజధాని నగరంలో తాము స్వయంగా అధికారంలోకి రాలేకపోయినా, కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టగలుగుతున్నామన్న ఆనందం ఆ పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలుండగా 25 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. కొడితే నేరుగా కొండనే ఢీకొట్టాలి అన్నట్లు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరిగాయి. సర్వేలలో ఏబీపీ - నీల్సన్ సంస్థ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 15 స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియాటుడే-ఓఆర్జీ, టైమ్స్ నౌ- సీ ఓటర్ మాత్రం 06, 11 స్థానాలు వస్తాయన్నాయి. వీటిని దాటుకుంటూ మరింత ముందుకెళ్లింది ఈ పార్టీ.