‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లో ఆరోపణలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్ మిశ్రాను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు.
అనంతరం కపిల్ మిశ్రా మాట్లాడుతూ ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు.
తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇస్తున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్ మద్దతుదారులు కపిల్ మిశ్రాపై దాడికి యత్నించారు.
ఒకప్పుడు కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.