న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు.
పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్‌తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
అభద్రతాభావంలో ప్రధాని మోదీ
ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment