UP Elections 2022 Results: Less Votes Than NOTA, AAP To Hold Victory Rally In UP - Sakshi
Sakshi News home page

UP Elections Results 2022: యూపీలో ఘోరపరాభవం.. నోటా కంటే తక్కువ ఓట్లు! అయినా ఆప్‌ సంబురాలు

Published Sat, Mar 12 2022 1:13 PM | Last Updated on Sat, Mar 12 2022 2:14 PM

Elections 2022 Results: Less Votes Than NOTA AAP To Hold Victory Rallies - Sakshi

లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకానొక దశలో యూపీ కంటే.. పంజాబ్‌ ఫలితాల మీదే దేశం మొత్తం ఆసక్తి కనబర్చింది. ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయ చరిత్ర సంపూర్ణంగా మారిపోయింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ ఏకంగా 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ముందు.. పంజాబ్‌ వ్యాప్తంగా ర్యాలీలు, రోడ్‌షోలతో పండుగను జరుపుకోనుంది ఆప్‌. అయితే ఒక్క సీటు కూడా గెల్వకుండా చేదు అనుభవం చవిచూసిన యూపీలోనూ జోరుగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఆప్‌. 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అక్కడ ఓటింగ్‌ శాతం 0.38 మాత్రమే వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఇది నోటా కంటే తక్కువ. చాలామంది ఆప్‌ అభ్యర్థులు డిపాజిట్‌ కూడా గల్లంతు అయ్యారు. అయినప్పటికీ పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయానికి సంబంధించి యూపీలో ర్యాలీలు చేపట్టబోతోంది. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. 

యూపీ ఫలితాలు ఎలా ఉన్నా.. ఢిల్లీ మోడల్‌కే మాకు ఆదర్శం. ప్రతీ పల్లెలో జెండా ఎగరాలి. ప్రతీ ఒక్కరూ మా పార్టీ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయం.. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతోందనే ప్రజల భావనను తెలియజేస్తోందని సింగ్ చెప్పారు. తమ పార్టీ గుర్తు అయిన చీపురుతో దేశంలోని రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి ఆప్ కు బలమైన క్యాడర్ ను తయారు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండేలా పోరాడుతామని... ఈ పోరాటం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. 

మార్చి 23, 24 తేదీల్లో లక్నోలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పర్ఫామెన్స్ పై ఈ సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవస్థను విస్తరించే అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యే జరిగాయని... అందువల్లే ఇతర పార్టీలకు ఓట్లు పడలేదని అభిప్రాయపడ్డారు సంజయ్‌ సింగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement