కాంగ్రెస్ మద్దతు ఎందుకంటే.. ఏడు భాషల్లో చెప్పిన కేజ్రీవాల్!!
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతును బయటి నుంచి తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎందుకు చేశామో ప్రజలకు వివరించారు. ఈ మేరకు యూట్యూబ్లో ఓ వీడియోను విడుదల చేసి, అందులో ఏడు భారతీయ భాషలలో తమ విధానాలను తెలియజేశారు. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం, కాంగ్రెస్ లేదా బీజేపీ దానికి మద్దతివ్వాలంటే తాము పెట్టిన షరతులు.. అన్నింటినీ ఆ వీడియోలో వివరించారు.
''మేం ప్రభుత్వం ఏర్పాటుచేయాలా అని ప్రజలను అడిగాం. మాకు రెండు రకాల సమాధానాలు వచ్చాయి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉండమని, రెండోది ప్రభుత్వం ఏర్పాటుచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని'' అంటూ ఆ వీడియో మొదలవుతుంది. ఇప్పటికీ తమది మైనారిటీ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ , బీజేపీ రెండూ ప్రతిపక్షంలోనే ఉన్నాయని చెప్పేలా ఓ బొమ్మ కూడా చూపించారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో భాగస్వామ్యం లేదని, అది ప్రభుత్వంలో కూడా భాగం కాదని తెలిపారు.
ఈ వీడియోను తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మళయాళం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో రూపొందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకోడానికి రెండు రోజుల ముందే దీన్ని అప్లోడ్ చేశారు. అవినీతి రహిత, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీతో అధికారం వరకు వచ్చిన ఆప్.. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పదే పదే తీసుకుంటూ వచ్చింది. సోమవారం కూడా కాంగ్రెస్ సాయం తీసుకోవాలా వద్దా అని అడిగినప్పుడు 74 శాతం మంది తీసుకోవాలనే చెప్పారని ఆప్ నేతలు తెలిపారు.