ప్రశాంత భూషణ్
జన లోక్పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ తిరస్కరించిన తర్వాత ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వానికి రాజీనామా చేయడం తప్ప మరో అవకాశం ఏమీ లేదని పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత భూషణ్ అన్నారు. ఈ బిల్లును ఆమోదించి, అమలులోకి తెస్తామన్నది తాము ఢిల్లీ వాసులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ - కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఎటూ లేవు కాబట్టి, ఇక అసెంబ్లీని రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ ఏదీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేదని భూషణ్ అన్నారు.
అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, దాన్ని నడిపించడం తమముందున్న అతిపెద్ద బాధ్యత అని, దాన్ని తాము నెరవేర్చకుండా బీజేపీ, కాంగ్రెస్ అడ్డుపడినప్పుడు ఇక తాము అధికారంలో ఉండటంలో ఏమాత్రం అర్థం లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడానికే ఆమ్ ఆద్మీ పార్టీ జన లోక్పాల్ బిల్లు గురించి అంతగా పట్టుబట్టిందన్న కిరణ్ బేడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆమె ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి అయిపోయారన్నారు.