ఘజియాబాద్ కొశాంబిలోని ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయంపై శ్రీరామ్ సేన మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. సేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యాలయానికి చేరుకుని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో ఆప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాంతో కిటికి అద్దాలు పగిలాయి. ఆప్ కార్యాలయంపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పరారయ్యారు.
హిందూ రక్షక సంస్థకు చెందిన శ్రీరామ్ సేనకు చెందిన మద్దతుదారులు ఆ దాడికి పాల్పడ్డారని ఘజియాబాద్ ఎస్ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీరామ్ సేన మద్దతుదారుడు విష్ణు గుప్తా సారథ్యంలో ఆ దాడి జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆప్ కార్యాయలం వద్ద భారీ భద్రతను మోహరించారు. ప్రముఖ న్యాయవాది జమ్మూ కాశ్మీర్పై వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.