బీజేపీకి కాదు ఆప్‌కే మొగ్గు!
34 నుంచి 37 స్థానాలు ఆప్‌కు వస్తాయని సర్వేల అంచనా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరవుతున్న కొద్దీ ప్రధాన పార్టీల విజయావకాశాలు అనూహ్యంగా తారుమారు అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీది పైచేయి కాగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గాలి వీస్తున్నట్లు సర్వేల్లో తేలింది. హస్తిన ఓటర్లు ఆప్‌కు స్వల్ప మెజారిటీతో పట్టం కట్టనున్నట్లు ప్రధాన సర్వేల ఫలితాలపై చేసిన రెండు సగటు ఫలితాల సర్వేల్లో వెల్లడైంది. హిందుస్థాన్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్, ఏబీపీ న్యూస్‌ల సర్వేల ఫలితాల ఆధారంగా ఎన్డీటీవీ వేసిన సగటు అంచనా సర్వే ప్రకారం.. అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 37 సీట్ల సాధించి అధికారంలోకి వచ్చే అవకాశముంది.
బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కొచ్చు. అలాగే.. ఏబీపీ నీల్సన్, సీ-ఓటర్, ఈటీ-టీఎన్‌ఎస్, హెచ్‌టీ, ద వీక్ సర్వేల ఫలితాలపై ‘టైమ్స్ నౌ’ వేసిన సగటు ఫలితాల అంచనాల్లో ఆప్‌కు 34, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 2 సీట్లు రావొచ్చని తెలిసింది. మరోపక్క.. ఇండియా టుడే-సిసిరో తాజా సర్వేలో ఆప్ ఏకంగా 38 నుంచి 46 సాధించనున్నట్లు తేలింది. బీజే పీకి 19 నుంచి 25, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 స్థానాలు దక్కొచ్చు. పాత సర్వేలు బీజేపీకి 38 నుంచి 37, ఆప్‌కు 28 నుంచి 29 సీట్లు రావొచ్చని అంచనా వేయడం తెలిసిందే.
పోటీ ప్రధానంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతున్నా...కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలటంపైనే వాటి గెలుపోటములు ఉన్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంపైనే ఆప్ విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని భావిస్తున్న 4 నుంచి 8 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేయగలిగితే దాని విజయం ఖాయమని ఎకనమిక్ సర్వే అంచనా. గెలవడానికి కావాల్సిన ఆ కీలక స్థానాల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌ను మరోమారు నిలుపుకుంటే తమ విజయానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నది బీజేపీ అంచనా.