
హజారేతో 'ఆప్' నేతల భేటీ
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు గురించి హజారేకు వివరించారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఆయన తెలిపారు. దీని ద్వారా అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు.
హజారేను ఆప్ నాయకులు కలిసిన విషయాన్ని ఆయన అనుచరుడు దత్త అవారి ధ్రువీకరించారు. జనలోక్ పాల్ బిల్లును కేజ్రీవాల్ సర్కారు సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును తెచ్చింది. 2011లో తయారు చేసిన జనలోక్ పాల్ బిల్లుకు ఇది సమానంగా ఉంటుందని 'ఆప్' వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.