
ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500
- నగరంలో భారీగా బీఎస్–3 వాహన విక్రయాలు
- ఆకట్టుకున్న ఆఫర్లు.. షోరూమ్‌లకు పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్
ఆఫర్ల హోరుతో వాహన షోరూమ్‌లన్నీ కళకళలాడాయి. ద్విచక్ర వాహనాలు, కార్లపైన భారీ ఆఫర్లు ప్రకటించడంతో జనం షోరూమ్‌లకు పరుగులు తీశారు. శుక్రవారం ఒక్కరోజే 10,500 వాహనాల విక్రయాలు జరుగగా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. భారత్ స్టేజ్ –3 వాహనాల అమ్మకాల ఆఖరి రోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని ఆటోమోబైల్ షోరూమ్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తమ వద్ద ఉన్న స్టాక్ కంటే ఎక్కువ మంది బుకింగ్‌ల కోసం బారులు తీరడంతో పలుచోట్ల షోరూమ్ డీలర్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొన్ని షోరూమ్‌లలో బినామీల పేరిట వాహనాలను బుక్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బీఎస్–3 వాహనాలపైన ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి నిషేధం కొనసాగనున్న నేపథ్యంలో వాటి అమ్మకాలకు శుక్రవారం ఒక్క రోజే గడువు మిగిలి ఉండడంతో విక్రయాలు విపరీతంగా సాగాయి. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–4 వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆటోమోబైల్ కంపెనీలు ఈ వాహనాలపైన భారీ ఆఫర్లను ప్రకటించడం వినియోగదారులను ఆకట్టుకుంది. ద్విచక్రవాహనాలపై రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వగా, కార్లపైన రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇచ్చారు.
ఒక్క రోజే 10 వేల వాహనాల విక్రయాలు...
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 షోరూమ్‌లు, వాటి అనుబంధంగా మరో 200 సబ్‌షోరూమ్‌లు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 1,000 నుంచి 1,500 వాహనాలు అమ్ముడవుతాయి. కానీ బీఎస్–3 వాహనాల రద్దు నేపథ్యంలో గురువారం 9,800 వాహనాల అమ్మకాలు జరిగితే.. శుక్రవారం ఆ సంఖ్య 10,500 దాటింది. వీటిలో 8,950 వరకు ద్విచక్రవాహనాలు కాగా మిగతా వాటిలో కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి.
బినామీ పేర్లతో అమ్మకాలు...
మరోవైపు పలు షోరూమ్‌లు బినామీ అమ్మకాలకు తెరలేపినట్లు ఆరోణలు వెల్లువెత్తాయి. రెండు రోజులుగా తమ షోరూమ్‌లలో పని చేసే సిబ్బంది, తెలిసిన వ్యక్తుల పేరిట వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆఫర్లు ఆకర్శించినా.. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ఇక శనివారం నుంచి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఇతర తేలికపాటి వాహనాలన్నీ బీఎస్–4 ప్రమాణాల మేరకు తయారు చేసినవి మాత్రమే విక్రయించవలసి ఉంటుంది.