
యోగి రాష్ట్రంలో మరో అమానుషం!
- అత్యాచార బాధితురాలిపై మరోసారి యాసిడ్ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సామూహిక అత్యాచార బాధితురాలిపై యాసిడ్ దాడి జరిగింది. లక్నోలో బాధితురాలు నివసస్తున్న హాస్టల్ వద్దే ఈ ఘటన జరిగింది. హ్యాండ్‌పంప్ వద్ద నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన ఆమెపై.. దుండగులు యాసిడ్ పోశారు. ఘటనలో బాధితురాలి మెడ కుడిభాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
హాస్టిల్ వద్ద పోలీసు భద్రత ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితురాలిపై తొమ్మిదేళ్ల క్రితం అత్యాచారం జరగ్గా.. ఆమెపై యాసిడ్ దాడి జరగడం ఇది నాలుగోసారి. రాయ్‌బరేలికి చెందిన మహిళపై 2008లో సామూహిక అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే 2011, 2013లో ఆమెపై యాసిడ్ దాడులు జరిగాయి. దీంతో ఆమె నివసిస్తున్న హాస్టల్ వద్ద పోలీసు పహారా ఏర్పాటుచేశారు.
అయినప్పటికీ ఈ ఏడాది మార్చిలో మళ్లీ బాధితురాలిపై యాసిడ్ దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించి.. నష్టపరిహారం అందించారు. తాజాగా మరోసారి బాధితురాలిపై దుండగులు యాసిడ్ పోసారు. సామూహిక అత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల వర్గీయులే వరుస దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది.