తేజస్వి యాదవ్‌కు జేడీయూ డెడ్‌లైన్
పట్నా: బిహార్ సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌కు జేడీయూ మరో నాలుగురోజులు డెడ్‌లైన్ విధించింది. కాగా నీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామాకు ససేమిరా అనడంతో... నితీష్ సర్కార్ ఇరుకుపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తేజస్వి రాజీనామా అంశంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు జేడీయూ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ కీలక సమావేశంలో ఆర్జేడీతో తెగదెంపులు విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తేజస్వి యాదవ్ రాజీనామాపై మరికొద్ది రోజులు వేచి చూడాలని జేడీయూ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా భేటీ అనంతరం ఆ పార్టీ నేత రామై రామ్ మాట్లాడుతూ... ఈ అంశంపై మరో నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా బిహార్‌లోని మహాకూటమి ప్రభుత్వంలో ఆర్జేడీ కీలక భాగస్వామి. జేడీయూ కంటే ఎక్కువ సీట్లు ఆర్జేడీకే ఉన్నాయి. నితీష్ సర్కార్‌కు అవసరం అయితే బయటినుంచి మద్దతిచ్చేందుకు సిద్ధమని బీజేపీ నిన్న సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో జేడీయూ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.