ఈనెల 23 నుంచి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని ఐఎండీ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: ఈనెల 23 నుంచి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం అంచనా వేసింది. పశ్చిమ భాగంలో గుజరాత్‌లోని వాల్సాద్, తూర్పున బెంగాల్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. అలాగే మహారాష్ట్ర, విదర్భ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తూర్పు భాగంలో బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు అడుగుపెట్టాయన్నారు.
తుపాన్ కారణంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ‘కొంత స్తబ్దత తరువాత... నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదలడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2–3 రోజుల్లో దేశంలోని చాలా భాగాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి’ అని అన్నారు.