అమ్మ మృతిపై సీబీఐ విచారణ చేయించండి
న్యూఢిల్లీ: జయలలిత మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం లోక్‌సభలో డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరిన సుందరం.. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.
జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపించినా, రహస్యాలు బయటకు రాకుండా తొక్కిపెడతారని, సీబీఐతో దర్యాప్తు చేసేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని సుందరం డిమాండ్ చేశారు. ఇటీవల పన్నీరు సెల్వం కూడా ఇదే డిమాండ్ చేశారు. జయలలిత మృతిపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, సినీ నటి గౌతమి సహా పలువురు ప్రముఖులు కూడా జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని గతంలో డిమాండ్ చేశారు. జయలలిత బంధువులు కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. పన్నీరు వర్గానికి చెందిన నాయకులు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ రోజు లోక్‌సభలో జీరో అవర్‌లో అన్నాడీఎంకే ఎంపీలు శ్రీలంకలోని తమిళుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తమిళులపై దాడులు జరుగుతున్నాయని, ఆ దేశాన్ని మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.. శ్రీలంకలోని తమిళుల సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు.