'చిన్నమ్మ వద్దని అమ్మ, ఎంజీఆర్ కోరుకున్నారు'
'చిన్నమ్మ వద్దని అమ్మ, ఎంజీఆర్ కోరుకున్నారు'
Published Tue, Feb 7 2017 12:12 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు శశికళను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని చెబుతుంటే.. తాజాగా ఆమెపై నిరసన స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ ఇద్దరూ శశికళకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కారు. దాంతోపాటు అసలు జయలలితది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయస్‌గార్డెన్స్‌లో ఒకసారి జరిగిన గొడవలో జయలలితను కిందకు తోసేశారని, అందువల్లే ఆమె ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. ఈ వ్యవహారాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారని, జయలలిత మరణంలో శశికళ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో చిన్నమ్మ పెత్తనం పెరిగిపోయిందని, ఆమె ఆధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పాండియన్‌లు ఇద్దరూ చెప్పారు.
అసలు శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేయడానికి వీల్లేదని జయలలిత ఒకసారి తనతో చెప్పారని మనోజ్ పాండియన్ అన్నారు. శశికళకు అసలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టడానికి అర్హత లేదని, తాము ఇంకా అమ్మ మరణం తాలూకు బాధ నుంచి బయటకు రాలేదని పీహెచ్ పాండియన్ చెప్పారు. శశికళ సీఎం కాకూడదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ కోరుకోవడం వల్లే శశికళ ప్రమాణస్వీకారం చేయలేకపోయారని ఆయన అన్నారు.
అయితే, పాండియన్ ఆరోపణలను అన్నాడీఎంకే కొట్టిపారేసింది. పొలిటికల్ మైలేజి కోసమే పాండియన్ ఆరోపణలు చేస్తున్నారని, జయలలితకు అందించిన చికిత్సల వివరాలను వైద్యులు ఇప్పటికే వెల్లడించారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
Advertisement
Advertisement