
మళ్లీ తెరపైకి పన్నీర్ సెల్వం
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (అమ్మ వర్గం) నేత ఓ. పన్నీర్ సెల్వం మరోసారి తెర ముందుకు వచ్చారు. ఢిల్లీ వేదికగా శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఎడపాడి పళనిస్వామి పాలన చెల్లదని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా శశికళ నియమించినందున ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. పార్టీ బాధ్యతలను తాను మాత్రమే నిర్వహించగలనని చెప్పారు.
పార్టీ చిహ్నం రెండాకుల కోసం ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న నోటుకు ఓటు అంశాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళతామన్నారు. ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు వెల్లడించాక ఎవరికీ మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తామంతా చర్చించుకుని నిర్ణయానికి వస్తామని పన్నీర్ సెల్వం తెలిపారు. తన చీలిక వర్గాన్ని శశికళ వర్గంలో కలిపేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన ఢిల్లీ బాట పట్టినట్టుగా కనిపిస్తోంది.