అమెరికాలో ఎయిరిండియా విమానానికి షాక్!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రయాణికులకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. షికాగో నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానాన్ని అమెరికా వైమానిక భద్రతా సంస్థ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్-ఎఫ్‌ఏఏ) అర్ధంతరంగా అడ్డుకుంది. ఎయిరిండియా విమానంలోని పలు సీట్లకు ట్యాగ్ నంబర్లు లేకపోవడంతో ఈ మేరకు షాక్ ఇచ్చింది.
ఎయిరిండియా విమానం బోయింగ్-777 (వీటీ ఏఎల్‌కే)లో అనూహ్యంగా తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌ఏఏ.. విమానంలోని పెద్దసంఖ్యలో సీటు బెల్టులకు టెక్నికల్ స్టాండర్డ్ ఆర్డర్ (టీఎస్‌వో) ట్యాగ్ లేనట్టు గుర్తించింది. ఇది భద్రతాపరమైన అంశం కాకపోయినప్పటికీ.. తప్పనిసరిగా టీఎస్‌వో ట్యాగ్ ఉండాల్సిందేనంటూ విమానాన్ని నిలిపేసింది.
342 సీట్లు కలిగిన ఈ విమానం ఫుల్‌గా బుక్ అయి.. ప్రయాణికులతో బయలుదేరడానికి సిద్ధమైన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉన్న ఎయిరిండియా విమానం బీ-777 నుంచి కొన్ని సీటుబెల్టులను డెల్టా విమానంలో షికాగోకు తెప్పించుకుంది. వీటిని ఇన్‌స్టాల్ చేసిన అనంతరం విమానం ఢిల్లీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఎఫ్‌ఏఏ తనిఖీల కారణంగా ఎనిమిది గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అమెరికా అధికారుల తీరుపై ఎయిరిండియా సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.