ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెనుప్రమాదం
న్యూఢిల్లీ: ముంబయికి చెందిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దానిని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్లో తీవ్ర సమస్య తలెత్తిందని పైలెట్ గుర్తించడంతో ముందస్తుగా వెనక్కి రప్పించి దిప్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777-300 అమెరికా కాలమానం ప్రకారం 4.30గంటలకు అమెరికాలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ముంబయికి బయలుదేరింది.
సరిగ్గా 29,000 అడుగుల ఎత్తులో ఉండగా విమానం మొత్తం కంపించడం ప్రారంభించడంతో అప్రమత్తమైన పైలెట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే దించేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో చాకచక్యంతో వ్యవహరించిన పైలెట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే దించేశాడు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అందులోని ప్రయాణీకులను ఢిల్లీకి చెందిన మరో విమానం ద్వారా తరలించారు. దించిన అనంతరం తనిఖీ చేయగా విమానం ఇంజిన్లోని ఓ బ్లేడ్ విరిగిపోయినట్లు గుర్తించారు.