డైరెక్టర్ వర్మకు అకున్ కౌంటర్ ఇదే!
హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు.
వర్మ వ్యాఖ్యలపై అకున్ సబర్వాల్ పరోక్షంగా స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లల పేర్లు బయటపెట్టబోమని, ఇలా బయటపెడితే వారి భవిష్యత్తు, జీవితం నాశనం అవుతాయని పేర్కొన్నారు. సిట్ మీద కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, పూర్తిగా చట్టబద్ధంగానే సిట్ విచారణ సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లలు మైనర్లు అని, చట్టప్రకారం వారి పేర్లు వెల్లడించకూడదని చెప్పారు. ఎవరి పిల్లలైనా పిల్లలేనని, చిన్నవాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న పిల్లల తల్లిదండ్రులను పిలిచింపి కౌన్సెలింగ్ ఇప్పించినట్టు తెలిపారు.