గురువారం స్వగ్రామంలో రైతు గజేంద్ర అంత్యక్రియల దృశ్యం
అన్నదాత ఆత్మహత్యపై పరస్పర ఆరోపణల పర్వం
దేశ రాజధాని నడిబొడ్డున.. వేలాది మంది చూస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి కళ్ల ఎదురుగా.. అన్నదాత ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటనకు బాధ్యులు ఎవరు? అన్న అంశంపై రాజకీయ పక్షాలన్నీ పరస్పర నిందారోపణలతో చావు రాజకీయాలకు తెరతీశాయి. రోడ్ల పైనా, విలేకరుల సమావేశాల్లో, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో, చివరకు పార్లమెంటులోనూ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. చివరకు అతడి ఆత్మహత్యపై దర్యాప్తు చేసే అధికారం ఎవరికి ఉంది అనే అంశాన్నీ వివాదం చేశారు. రైతు ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీ పోలీసు కార్యాలయం, కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో.. గజేంద్రసింగ్ ఆత్మహత్యకు ఢిల్లీలోని ఆప్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ సర్కారు బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే.. ఆ పాపం ఆప్‌దేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రత్యారోపణ చేశారు. ఆత్మహత్య చేసుకునేలా అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గత పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఆప్ స్పందిస్తూ.. రాజ్‌నాథ్ అబద్ధాలు చెప్తున్నారని, గజేంద్రను రక్షించటానికి పోలీసులు ప్రయత్నించలేదని, ప్రేక్షక పాత్ర పోషించారని ఢిల్లీ పోలీసులపై నిందమోపారు.
వ్యవసాయ సంక్షోభంపై తన పది నెలల పాలనా కాలంతో పాటు.. గత ప్రభుత్వాల పాలనలోని లోటుపాట్లపైనా చర్చ అధ్యయనం జరగాలని.. ఉమ్మడిగా పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. రైతును కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి.. దానిపై దర్యాప్తు జరిపే అధికారం జిల్లా మెజిస్ట్రేట్‌కు లేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్వగ్రామంలో రైతు అంత్యక్రియలు
దౌస(రాజస్థాన్): ఆప్ ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు గజేంద్రసింగ్ అంత్యక్రియలు గురువారం రాజస్థాన్‌లోని ఆయన స్వగ్రామం నంగల్ జామర్‌వాడలో ముగిశాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ప్రేరేపించారు!
గజేంద్ర కుటుంబీకుల ఆరోపణ
దౌసా: గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విపరీత చర్య దిశగా అతన్ని ప్రేరేపించారని ఆరోపించారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌దే బాధ్యతన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో మాట్లాడాకే గజేంద్ర సింగ్ ఆప్ ర్యాలీకి వెళ్లాడని అతని సోదరుడు విజేంద్ర సింగ్ గురువారం తెలిపాడు. దగ్గరి బంధువుల పెళ్లి ఉండగా ఎందుకు ఢిల్లీకి వెళుతున్నావని తాను అడిగానని, సిసోడియాతో మాట్లాడానని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆయన ముందు పెడతానని’ చెప్పి బయలుదేరాడని వివరించాడు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మశక్యంగా లేదన్నాడు. గజేంద్ర ఉరి వేసుకోవడానికి ముందు చెట్టుపై నుంచి విసిరిన లేఖలోనూ తాను ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావనే ఉంది తప్ప... ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎక్కడా లేదని ఎత్తిచూపాడు.
చేతిరాత గజేంద్రది కాదు: సోదరి
గజేంద్ర రాసినట్లుగా చెబుతున్న లేఖలో చేతిరాత ఆయనది కాదని సోదరి రేఖ, కూతురు మేఘ అన్నారు. చేతిరాతపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంలో ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. గజేంద్రకు రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండేదని, 2008, 2013 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని, ఆప్‌లో చేరేందుకు ఇటీవల ఆసక్తి చూపాడని కుటుంబీకులు చెప్పారు.
కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసన
రైతు ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారమిక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట, కాంగ్రెస్ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసం ముందు ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం పోస్టర్లు తగులబెట్టారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేన న్లు ప్రయోగించారు.