అమర్, జయ ప్రవేశంతో ఆరెల్డీలో లుకలుకలు
చౌదరి అజిత్సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) పార్టీలోకి అమర్ సింగ్, జయప్రద వెళ్లడంతో ఆ పర్టీలో లుకలుకలు మొదలయ్యాయి. అసలు వాళ్లను పార్టీలోకి తీసుకోవడం ఏంటని కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లు ఆరెల్డీ పంచన చేరడంతో పలు పార్టీలకు సంబంధించి లోక్సభ ఎన్నికల వ్యూహాలు కూడా మారుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో అమర్సింగ్ ఫతేపూర్ సిక్రీ నుంచి, జయప్రద బిజ్నూర్ నుంచి పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. ఫతేపూర్ సిక్రీలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి అరిదమాన్ సింగ్ భార్య పక్షిలా సింగ్ను నిలబెడుతుండగా, బీఎస్పీ తరఫున ఆ పార్టీ నేత రాంవీర్ ఉపాధ్యాయ భార్య సీమా ఉపాధ్యాయను పోటీ చేయిస్తున్నారు. ఆమె మాయావతికి సన్నిహితురాలు. ఇంతకుముందు ఆమె కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ను ఓడించారు. అయితే ఫిరోజాబాద్ ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్పై రాజ్ బబ్బర్ గెలిచారు. బీజేపీ మాత్రం ఈ స్థానంలో ఎవరిని నిలబెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్, నటుడు సన్నీ డియోల్, బాబూలాల్ చౌదరి, కేశవ్ దీక్షిత్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అమర్ సింగ్ వస్తున్నారు కాబట్టి.. ఇప్పుడు గట్టి అభ్యర్థిని నిలబెట్టాల్సిందేనని ఇతర పార్టీలు భావిస్తున్నాయి.