అమెజాన్ నుంచి ఇక ‘కిరాణా నౌ’
త్వరలో దేశవ్యాప్తంగా విక్రయాలు
దీనికోసం చిరు వ్యాపారులతో జట్టు
‘సాక్షి’తో అమెజాన్ డెరైక్టర్
అమిత్ పాండే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిత్యావసర వస్తువుల్ని ఆన్‌లైన్లోకి తేవడానికి ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సిద్ధమయింది. ఇందుకోసం ‘కిరాణా నౌ’ పేరిట చిన్నచిన్న కిరాణా వర్తకులతో చేతులు కలుపుతోంది. బెంగళూరులో కంపెనీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించింది. దుకాణదారులు స్మార్ట్‌ఫోన్ ఉంటే ‘కిరాణా నౌ’లో భాగస్వాములుత కావొచ్చు. ప్రస్తుతానికి కస్టమర్ తన మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే ఆన్‌లైన్‌లో సరుకులను ఆర్డర్ చేయాలి. 4 గంటల్లోపు డెలివరీ చేస్తారు. వ్యాపారులను సమాయత్తం చేసేందుకు 18 నగరాల్లో తమ బృందాలు నిమగ్నమయ్యాయని అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డెరైక్టర్ అమిత్ దేశ్‌పాండే తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు.
పెట్టుబడులు రూ.12,000 కోట్లు...
భారత్‌లో రూ.12,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైనట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలియజేశారు. ఇందులో భాగంగానే 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో హైదరాబాద్‌లోని కొత్తూరులో గిడ్డంగి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ‘మే’ నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ గిడ్డంగి... భారత్‌లో కంపెనీకి అతిపెద్దదిగా మారుతుంది. దీంతో 9 రాష్ట్రాల్లో కంపెనీ నిర్వహిస్తున్న 10 గిడ్డంగుల మొత్తం సామర్థ్యం 10 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది. ఈ గిడ్డంగితో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను వేగంగా డెలివరీ ఇచ్చేందుకు కంపెనీకి వీలవుతుందన్నారు.
పెద్ద నగరాల వాటా సగమే...
అమెజాన్ వ్యాపారంలో పెద్ద నగరాల వాటా 50 శాతం ఉండగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా 50 శాతం నమోదవుతోందని అమిత్ దేశ్‌పాండే చెప్పారు. 50 శాతం కస్టమర్లు మొబైల్ ఫోన్ ద్వారా ఆర్డర్లిస్తున్నారని తెలియజేశారు. ‘దేశవ్యాప్తంగా 22వేల మంది వ్యాపారులు అమెజాన్‌తో చేతులు కలిపారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ముత్యాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాల వ్యాపారులు దేశవ్యాప్తంగా విస్తరణకు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రాముఖ్యత ఉన్న నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరల వంటి ఉత్పత్తులకు ఆన్‌లైన్ వేదిక కల్పించనున్నాం. గిడ్డంగి ఏర్పాటైతే వ్యాపారం గణనీయంగా పెరుగుతుంది’ అని చెప్పారు.