మోడీకి అమెరికా పాస్ పోర్టు కూడా ఇవ్వలేదు: లాలూ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ''మోడీ ఎవరు? అమెరికా ప్రభుత్వం ఆయనకు పాస్ పోర్టు ఇవ్వలేదు.. ప్రపంచమంతా ఆయన గురించి తెలుసు. ఆయన అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఓటింగ్ రోజున అన్నీ స్పష్టమవుతాయి'' అని అన్నారు.
తాను కూడా ఒకప్పుడు చాయ్, బిస్కట్లు అమ్మినవాడినేనని, పాడిపంటలు చూసుకున్నానని అంటూ నరేంద్రమోడీ 'చాయ్ వాలా' ఇమేజి గురించి స్పందించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువవుతున్నాయన్న మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ ముందునుంచే అభివృద్ధి బాటలో ఉందని, ఆయనొచ్చి చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించినా తన పార్టీ మాత్రం ఎప్పటికీ ముగిసిపోయే సమస్య లేదని చెప్పారు. లాలూ ఇంకా ముసలోడు కాలేదని , సమస్యలపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. దాణా స్కాంలో శిక్ష పడిన నేపథ్యంలో పోటీ చేయడానికి కుదరదు కదా అని ప్రశ్నించగా, లాలూ పోరాడినా.. లేకపోయినా, తమ సిద్ధాంతాలతో మాత్రం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు దేశాన్ని నాశనం చేయాలన్న రహస్య అజెండా ఉందన్నారు. బీహార్లో మతతత్వ శక్తులను అంతం చేయడానికి తమ పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.