సిరియాపై సైనిక దాడి చేయడాన్ని యావత్ ప్రపంచంతో పాటు అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా చట్టసభల ప్రతినిధుల నుంచి ఈ దాడికి ఆమోదం పొందాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అక్కడో సర్వే జరిగింది. ఏబీసీ న్యూస్ - వాషింగ్టన్ పోస్ట్ కలిసి సంయుక్తంగా ఈ సర్వే చేశాయి. ఇందులో, 59 శాతం మంది అమెరికన్లు సిరియాపై యుద్ధాన్ని, దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు.
కేవలం 36 శాతం మంది మాత్రమే సైనిక దాడిని సమర్థించారు. డెమొక్రాట్లలో 54 శాతం, రిపబ్లికన్లలో 55 శాతం, రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించేవారిలో 66 శాతం మంది అమెరికా ప్రభుత్వం సిరియాపై దాడి చేయడానికి వ్యతిరేకంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా అమెరికా సర్కారు తీరును వ్యతిరేకిస్తున్నట్లే తెలుస్తుంది.
ఒకవేళ ఈ దాడుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ కూడా భాగస్వామ్యం వహిస్తే మాత్రం దాడికి పర్వాలేదని కొంతమంది చెబుతున్నారు. అంటే, ఏకపక్షంగా అమెరికా మాత్రమే సిరియా మీద తెగబడేందుకు వారు వ్యతిరకమన్న మాట. కానీ, సిరియాపై సైనికదాడిలో పాల్గొనే ప్రతిపాదనను బ్రిటిష్ పార్లమెంటు తోసిపుచ్చింది. సిరియాలో ఉన్న విపక్ష బృందాలకు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడాన్ని కూడా 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకించారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.
సిరియాపై దాడిని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు: సర్వేలో వెల్లడి
Published Wed, Sep 4 2013 11:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement