అమరావతి సాక్షిగా కృష్ణమ్మ కబ్జా
* ‘బాబు’ల కోసం రాజధానిలో కృష్ణా నది కరకట్టలో మార్పులు
* నదిలోకి జరిపేందుకు ప్రతిపాదన.. అక్రమ నిర్మాణాలను రక్షించే ‘ప్లాన్’
* మాస్టర్‌ప్లాన్‌లో కొత్త అలైన్‌మెంట్‌తో ముంపు ముప్పు
* ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ఒత్తిడి.. నిపుణుల హెచ్చరికలు బేఖాతర్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నేరం చేసినా తప్పించుకోవాలంటే... అది నేరం కాదని... మహా పుణ్యకార్యమని అందరినీ ఒప్పించాలి... పనిలో పనిగా అదే నేరం చేసిన తనవాళ్లనందరినీ తప్పించేయాలి... అధికారదండం చేతిలో ఉంటే... అందులోనూ చంద్రబాబు అంతటి వాడే తలచుకుంటే... జనాన్ని నమ్మించడం.. నేరం కాదని నిరూపించడం.. అందరినీ ‘ఒడ్డు’న పడేయడం చిటికెలో పని.. సీఎం చంద్రబాబు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇపుడు చేస్తున్నదిదే...
కృష్ణానది సమీపంలో ఓ అక్రమ నిర్మాణంలో కొలువుదీరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇపుడు ఏకంగా నదిని కబ్జాచేసి ఆ నిర్మాణానికి అధికారికముద్ర వేయబోతున్నారు. కరకట్టను నదిలోకి జరిపేసేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేశారు. దీంతో సీఎం నివాసమే కాదు అస్మదీయుల అక్రమ నిర్మాణాలన్నీ సక్రమమైనవిగా మారిపోబోతున్నాయి. తాను ఏరి కోరి కోట్లు పోసి అనేక హంగులు సమకూర్చుకున్న ‘లింగమనేని ఎస్టేట్’ను అక్కడి నుంచి ఎలాగూ కదపలేం కనుక అది అక్రమ నిర్మాణం అనేందుకు కారణమైన కృష్ణానది కరకట్టనే అక్కడి నుంచి నదిలోకి ముఖ్యమంత్రి మార్చేయబోతున్నారు. కరకట్టను లోపలికి జరపడమంటే నదీప్రవాహ ఉరవడికి అడ్డుకట్ట వేయడమేనని, తద్వారా ప్రకాశం బ్యారేజీకి ప్రమాదమని తెలిసినా వెనుకడుగువేయడం లేదు. దీనికి ‘రాజధాని బృహత్ ప్రణాళిక’ అనే అందమైన ముసుగు వేశారు.
నదిలోకి జరగనున్న కరకట్ట
కృష్ణానది ప్రవాహ దిశ మారకుండా ఉండేందుకు, దిగువ ప్రాంతాలను వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన కుడి, ఎడమ కరకట్టలను దశాబ్దాల కిందట నిర్మించారు. అమరావతి నిర్మాణం నేపథ్యంలో కృష్ణానది ఎడమ కరకట్టను సుమారు 250 నుంచి 400 మీటర్ల లోపలకు నదిలో నిర్మించాలని ‘రాజధాని బృహత్ ప్రణాళిక’లో ప్రతిపాదించారు.
దీనిని బట్టి గుంటూరుజిల్లా వెంకటపాలెం- పెనుమాక మధ్యలోని చిగురు బాలల ఆశ్రమం వద్ద నుంచి కొండవీటి వాగు నదిలో కలిసే ప్రాంతం వరకు కరకట్టను లోపలకు నిర్మించనున్నారు. అదే జరిగితే నది వెడల్పు తగ్గడం వల్ల ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులంటున్నారు. ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా...
రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి ఒక్కటొక్కటిగా బైటపడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి మీదుగా సీడ్ క్యాపిటల్‌లోకి వెళ్లేందుకు నిర్మించనున్న 60 మీటర్ల రహదారిని మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. చంద్రబాబు, లోకేష్ తదితరుల నివాసాలకు వెనుక వైపున ఈ రహదారి ఉంటుంది. అయితే దానికి ఆనుకుని కృష్ణానది ఎడమ కరకట్ట ఉన్నదన్న విషయాన్ని ప్రణాళికలో ఎక్కడా సూచించలేదు. కరకట్ట అలైన్‌మెంట్ మార్పు చేస్తామన్నారే గాని, దానికి కారణాలు కూడా చెప్పలేదు.
నూతన అలైన్‌మెంట్ ఎత్తు, వెడల్పునూ పేర్కొనలేదు. అక్రమ నిర్మాణంగా ఉన్న సీఎం నివాసం సహా అధికార పార్టీ పెద్దలకు చెందిన మొత్తం 22 రకాల నిర్మాణాలకు దూరంగా కృష్ణానది కరకట్టను నదిలోకి జరపడమే ఈ అలైన్‌మెంట్ మార్పు ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఈ నిర్మాణాలిక సక్రమ నిర్మాణాలుగా మారిపోనున్నాయి.
కరకట్ట మారగానే రానున్న హోటళ్లు.. రిసార్టులు..
కరకట్ట సమీపంలో సుమారు 165 ఎకరాల భూమి అనేకమంది బడాబాబుల చేతుల్లో ఉంది. భూసమీకరణలో ప్రభుత్వానికి 20 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. మిగిలినవారు భూములివ్వబోమంటూ అభ్యంతర పత్రాలను సమర్పించారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం కరకట్టను నది లోపలకు మార్చి నిర్మించనున్నందున చంద్రబాబు, లోకేష్‌లు ఉంటున్న నివాసాలతో పాటు బడాబాబులకు చెందిన భూములు కూడా సక్రమమైనవిగా బయటపడతాయి. ఆ ప్రాంతాన్ని మాస్టర్‌ప్లాన్‌లో ‘పి2’ ‘ఎస్2’ కింద చూపారు.
ఇందులో హోటళ్లు, రిసార్టులు, విద్యా సంస్థలు రానున్నాయి. ఇక్కడ భూమి కలిగిన ఓ ప్రజాప్రతినిధి భవిష్యత్తులో ఓ పెద్ద వైద్య కళాశాలను నిర్మించాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. తాను ప్రభుత్వానికి కొంత భూమి ఇచ్చినందున ప్రత్యామ్నాయంగా ఇక్కడే భూమి ఇవ్వాలని ఆ నేత డిమాండ్ చేస్తున్నారట.
ఆర్‌సీ చట్టం ఏం చెబుతోందంటే..?
కృష్ణా, గోదావరి నదుల పరిరక్షణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1884లో రివర్ కన్జర్వేషన్ (ఆర్‌సీ) చట్టం చేసింది. దీని ప్రకారం గవర్నర్ జనరల్, కలెక్టర్, ఆర్‌సీ అధికారికి అధికారాలున్నాయి. ఈ చట్టం ప్రకారం నదుల ప్రవాహానికి అవరోధాలు కలిగించే ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదు. నదిలోపలి లంక భూముల్లోనూ నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించే ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదు. పంటలు కూడా వేయరాదు. నదీ ప్రవాహం గట్టును కోసేస్తూ వ్యక్తుల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలిగిం చే విధంగా మారితే ఆర్‌సీ అధికారి నివారణా చర్యలు చేపట్టాలి. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వాలి. ఆటంకం కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై క్రిమినల్ చర్యలూ చేపట్టవచ్చు.
కరకట్టకు లోపల ఎందరో ప్రముఖులు...
కృష్ణా కరకట్ట లోపల అంటే నదీ ప్రవాహ ప్రాంతంలో అనేకమంది ప్రముఖుల నివాసాలున్నాయి. సీఎం చంద్రబాబు.. లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటిని అధికారిక నివాసంగా మార్చుకోగా, ఆయన కుమారుడు లోకేశ్.... అప్పారావు అనే ఎన్నారైకి చెందిన గృహంలో ఉంటున్నారు.
వీరితో పాటు బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కాంగ్రెస్ నేత- సినిమా నటుడు చిరంజీవి, తెదేపా నేతలు కోమటి బ్రదర్స్, చైతన్య విద్యాసంస్థల యజమాని బి.ఎస్.రావు, పాతూరి నాగభూషణం, చందన బ్రదర్స్, బొప్పన బ్రదర్స్, లక్కిరెడ్డి బ్రదర్స్, డాక్టర్ రమేష్ తదితరుల నివాసాలు ఉన్నాయి. ఇక్కడే గణపతి సచ్చిదానంద ఆశ్రమంతో పాటు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయి. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయమూ ఇక్కడే ఉంది. కరకట్ట లోపల నిర్మాణాలన్నీ అనుమతి లేని నిర్మాణాలేనని, అవి ఆర్‌సీ చట్టానికి విరుద్ధమని ప్రభుత్వమే పలు సందర్భాలలో ప్రకటించింది. ఆర్‌సీ చట్టం కింద రాష్ర్టప్రభుత్వం గత ఏడాది మార్చిలో 25 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.