జీఎస్టీ బిల్లు - అంచనాలు
న్యూడిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్ టీ బిల్లు కు గ్రీన్ సిగ్నల్ లభించడం దాదాపుగా ఖాయిమైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కేంద్ర కేబినెట్ బిల్లులో కీలకమైన మార్పులకు ఆమెదం తెలపడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్నుకు మోక్షం లభించనుంది. వివాదాస్పదమైన ఒక శాతం తయారీ పన్ను తొలగించడం, తొలి ఐదేళ్లలో రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లితే ఇందుకు పరిహారాన్ని చెల్లించే హామీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేయడం కూడా దీనికి ఊతమిస్తోంది. ఆగస్ట్ 12లోగా ముగియనున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు చట్ట రూపాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది.
ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతోంది. తొలుత రాజ్యసభలో, అనంతరం లోక్‌సభలో ఆమోదం కోసం యోచిస్తోంది. ఈ బిల్లు చట్టమైతే. దేశవ్యాప్తంగా ఒకే పన్ను రేటు అమల్లోకి రానుంది. ఏప్రిల్1, 2017నుంచి అమలు తేవాలని పట్టుదలగా ఉంది. అటు వచ్చే వారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తిచేసినట్లు కేంద్ర సహాయమంత్రి నక్వీ చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు ఆమోదం, ప్రభావంపై అనేక అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా,ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్స్, ఎఫ్ ఎంసీజీ, రియల్ ఎస్టేట్, టూరిజం, ఆన్ లైన్ మార్కెటింగ్ తదితర రంగాలు ప్రభావితం కానున్నాయి. దీనిమూలంగా ప్రస్తుత అమ్మకపు పన్ను భారీగా క్షీణించేందుకు వీలుంటుందనీ, దీంతో ఫ్యాన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఒవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా.
ద్వంద్వ పన్నుల భారం ఉండదని చెబుతున్న ఈ బిల్లుకు అమల్లోకి వస్తే విలాసవంత వాహనాలు మినహా మిగిలిన వాహనాలు, విడిభాగాలు జీఎస్‌టీకిందకు రానుండడంతో వాహనాల ధరలు, సేవల వ్యయాలు తగ్గుతాయంటున్నారు. వ్యక్తిగత సంరక్షణ, వంట నూనెలు వంటివి జీఎస్‌టీ కిందకు వస్తే పన్నులు పెరుగుతాయి. ఫలితంగా ధరలు కూడా కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఇవి నిత్యావసరాల కేటగిరీ లో ఉండడంతో తక్కువ స్థాయి పన్ను అమలవుతోంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు రవాణా, గిడ్డంగుల నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. తాజాగా రూపొందించిన జీఎస్‌టీ ముసాయిదాలో ఈకామర్స్ లావాదేవీలకు ప్రత్యేక పన్ను విధానాలను అమలవుతాయి. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఒకే పన్ను రేటు వర్తిస్తుంది. పలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులపై విధించే సర్వీస్ ట్యాక్స్ మరింత పెరిగే అవకాశముంది.
వివిధ రాష్ర్టాలు విధిస్తున్న పలురకాల పన్నుల స్థానే రెండు మూడు పన్నులే అమల్లోకి వస్తాయి. దీంతో పరోక్ష పన్నుల వ్యవస్థపట్ల అందరికీ స్పష్టత వస్తుంది. వస్తువులు, సేవలు, తయారీ, వినియోగం, రవాణా వంటి పలు విభాగాలపై పడుతున్న పలురకాల పన్నులు తొలగుతాయి. అమ్మకపు పన్ను, వ్యాట్, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ సుంకం తదితర సుంకాలు ఒకే గొడుగుకిందకు వస్తాయి. ఇది ప్రత్యక్షంగా పలురంగాలకు లబ్ది చేకూర్చడంతోపాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు.