‘అనంత’లో సెంట్రల్ వర్సిటీ
పుట్టపర్తిలో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేస్తాం: సీఎం
నీతి ఆయోగ్ నివేదిక తర్వాత హోదాపై నిర్ణయం: వెంకయ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురంలో అతిపెద్ద ‘బెల్’ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే సెంట్రల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తాం. పుట్టపర్తిలో ఎలక్ట్రానిక్ పార్కు, ఎన్‌పీ కుంటలో సోలార్ పార్కును నెలకొల్పుతాం. అనంతపురాన్ని కరువురహిత జిల్లాగా మారుస్తాం’’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఆధ్వర్యంలో పెనుకొండ నియోకవర్గంలోని పాలసముద్రంలో నిర్మించబోయే ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్’కు బుధవారం రక్షణ శాఖ మనోహర్ పారికర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతోపాటు అంతకుముందు కొత్తచెరువులో ‘రైతు కోసం చంద్రన్న’ ముగింపు యాత్రలో ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపి నదుల అనుసంధానానికి నాంది పలికిన ఘనత తమదేనన్నారు.
అమృత్ నగరాల జాబితాలో అమరావతి
నీతి ఆయోగ్ నివేదిక వచ్చాకే ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. అమరావతిని అమృత్ నగ రాల జాబితాలో చేరుస్తున్నాం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు, వెంకయ్య ఇద్దరూ ‘నాయుడు’లనే అంటున్నారు.కుల రాజకీయాలతో వ్యవస్థను చీల్చా రు. ఇప్పటికైనా మానుకోండి’’ అని పేర్కొన్నారు.
రక్షణ సాంకేతికతను అందించడమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, అనంతపురం: భారత రక్షణశాఖకు, మిలిటరీకి సాంకేతికతను అందించడమే తమ తొలి ప్రాధాన్యత ని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్’కు బుధవారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన బెల్‌ప్రతినిధులతో మాట్లాడారు. తర్వాత సోమందేపల్లి బహిరంగసభలో ప్రసంగించారు.
లక్ష మందికి ఏర్పాట్లు చేయండి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన కార్యక్రమం(అక్టోబర్ 22న)లో లక్ష మంది పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో శంకుస్థాపనపై సమీక్షించారు.ఆ రోజు సభలో ‘రైతు వందనం’ పేరుతో భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.