అంతమందిని ఆహ్వానించి ఆమె తప్పుచేశారు..!
వాషింగ్టన్: ఇంకో నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ నేతలపై వాగ్బాణాలు సంధించారు. కొత్త ప్రభుత్వ విధానాల రూపకల్పనలో బిజీబిజీగా గడుపుతున్న ఆయన ఆదివారం ప్రఖ్యాత టైమ్స్ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాక్ యుద్ధం, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, చైనాతో వాణిజ్యం, సిరియా శరణార్థులు, జర్మనీ విధానాలు, బ్రెగ్జిట్ తదితర అంశాలపై వాగ్బాణాలు సంధించారు.
లక్షమందికిపైగా సిరియా, లిబియా శరణార్థులను జర్మనీలోకి ఆహ్వానించడం చాన్సలర్ ఏంజిలా మోర్కెల్ చేసిన ఘోర తప్పిదమని ట్రంప్ అన్నారు. దానికి బదులుగా సిరియాలోనే సేఫ్‌జోన్లు ఏర్పాటు చేసి, ప్రజలు అక్కడే ఉండేలా చేయాలని ఇందుకు అవసరమైయ్యే ఖర్చునంతా అమెరికాకు మిత్రులైన గల్ఫ్ దేశాలు భరించాలని పేర్కొన్నారు.
యురోపియన్ యూనియన్(ఈయూ) అనే వాహనాన్ని నడిపించేదే జర్మనీయే అని, ఈ విషయం ఈయూలోని అన్ని దేశాలకు బాగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. శరణార్థులను చేర్చుకోవాలన్న జర్మనీ నిర్ణయం వల్లే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలిగిందని, ఈ విషయంలో బ్రిటన్ చాలా తెలివిగా వ్యవహరించిదని ట్రంప్ అన్నారు. చైనాతో వాణిజ్యంలో ఎంత లోటు(deficit) ఉందో అమెరికా ప్రకటించాల్సిన అవసరం ఉందని, కొత్తగా ఏర్పడబోయే ్పరభుత్వం ఆ పని తప్పక చేస్తుందని చెప్పారు. ట్రంప్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
- ఒబామా కేర్ పథకాన్ని పూర్తిగా రద్దుచేస్తాం. ఇందుకోసం ఏమేం చెయ్యాలనేదానిపై చర్చలు పూర్తికావచ్చాయి. అతి త్వరలోనే మరో ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తాం. తక్కువ ఖర్చుతో అందరికీ వైద్యం అందిస్తాం.
- రష్యాపై ఆంక్షలు ఎత్తేయడంలో అణ్వస్త్రాల నిర్వీర్యం కీలక అంశం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
- బ్రెగ్జిట్.. బ్రిటన్ తీసుకున్న తెలివైన నిర్ణయం.
- చైనా సహా ఇతర దేశాలతో అమెరికా కొనసాగిస్తోన్న వాణిజ్యంలో లోటు(deficit)ను వెల్లడిస్తాం.
- ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ 'నాటో'ను నిర్లక్ష్యం చేశాయి. నాకు మాత్రం దానితో చాలా పనుంది.
- ఇరాన్‌తో అణుఒప్పందమంత చెత్త నిర్ణయాన్ని నేనెప్పుడూ వినలేదు.
- ఇరాక్‌పై యుద్ధం తేనేతెట్టును కదిలించినట్లైంది.
- ప్రెసిడెంట్ అయ్యాక కూడా ట్విట్టర్‌లో కొనసాగుతా. ఎవరైనా నిజాయితీ లేకుండా వార్తలు రాస్తే ట్విట్టర్‌లోనే ఖండిస్తా.