
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యే
ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తర్వాత.. ఇప్పుడు మరో ఆప్ ఎమ్మెల్యే కూడా నకిలీ డిగ్రీల కేసులో చిక్కుకున్నారు.
ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తర్వాత.. ఇప్పుడు మరో ఆప్ ఎమ్మెల్యే కూడా నకిలీ డిగ్రీల కేసులో చిక్కుకున్నారు. భావనా గౌర్ అనే మహిళా ఎమ్మెల్యే విద్యార్హతలు తప్పుడువంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హమైనదేనని ఢిల్లీ కోర్టు భావించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల అధికారులకు అందజేసిన అఫిడవిట్లో ఆమె తప్పుడు వివరాలు పేర్కొన్నారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ కేసును విచారణకు స్వీకరించారు. 2013 డిసెంబర్ ఎన్నికల్లో ఒకలా, 2015 ఫిబ్రవరి ఎన్నికల్లో మరోలా ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారన్నది ప్రధాన ఆరోపణ. నకిలీ డిగ్రీల కారణంగానే జితేందర్ సింగ్ తోమర్ తన న్యాయశాఖ మంత్రి పదవిని కోల్పోయిన నెల రోజుల లోపలే మరో ఆప్ ఎమ్మెల్యే ఇదే తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఎ కింద సమరేంద్రనాథ్ వర్మ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడతాయి. ఈ కేసును ఈనెల 25వ తేదీన విచారించాలని కోర్టు నిర్ణయించింది. 2013 ఎన్నికల్లో తాను 12వ తరగతి మాత్రమే చదివినట్లు పేర్కొన్న గౌర్ .. 2015లో మాత్రం తాను బీఏ, బీఈడీ చేసినట్లు చెప్పారు. కేవలం 14 నెలల కాలంలోనే బీఏ, బీఈడీ డిగ్రీలను ఆమె ఎలా పూర్తిచేశారని.. దాన్నిబట్టే ఆమె తప్పుడు విద్యార్హతలు చూపించినట్లు అర్థమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు అఫిడవిట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా తప్పు అయి ఉండాలన్నారు.