ప్రముఖులకు పుష్కర ఆహ్వానాలిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా తిరుగుతున్నారు..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై నినాదాలు, నిరసనలు తెలుపుతున్నవేళ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసిన చంద్రబాబు.. ఆమెను కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాసేపటి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానిని కూడా పుష్కరాలకు ఆహ్వానించిన బాబు.. 12 అంశాలతో కూడిన వినపత్రాన్ని అందించారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను కూడా ఏపీ సీఎం పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 12.20 కి ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది. తన ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశంఉంది.