చిన్నకోడలి వ్యూహాలు ఏంటి?
చిన్నకోడలి వ్యూహాలు ఏంటి?
Published Wed, Jan 25 2017 3:20 PM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM
ఎన్నికలకు సమయం దగ్గర పడింది. వ్యూహ ప్రతివ్యూహాలతో కొమ్ములు తిరిగిన నాయకులంతా దూసుకెళ్తున్నారు. తలపండిన ఒక సీనియర్ మోస్ట్ నాయకురాలితో.. ఇప్పుడే తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న ములాయం చిన్నకోడలు తలపడుతున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రీటా బహుగుణ జోషితో ఢీకొంటున్న అపర్ణాయాదవ్ తన సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పోటీ చేయమని తన మీద బాగా ఒత్తిడి వచ్చిందని, దాంతో టికెట్ ఇవ్వండి.. ఎక్కడైనా నెగ్గుతానని తమవాళ్లతో చెప్పినట్లు ఆమె ధీమాగా తెలిపారు. పెద్దకోడలు డింపుల్ యాదవ్ కొంతవరకు సురక్షితమైన స్థానాన్ని ఎంచుకోగా.. అపర్ణ మాత్రం అసలు సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఎంచుకున్నారు. తనకు అదే టికెట్ కావాలని ఆమె కోరగా.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న బావగారు అఖిలేష్ యాదవ్ కూడా అదే టికెట్‌ను ఆమెకు ఖరారు చేశారు.
వారసత్వ రాజకీయాలు తప్పవా.. అని పలువురు మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా, దానికి దీటుగా సమాధానం ఇచ్చారు. లాయర్ల కొడుకులు లాయర్లయితే తప్పులేదు, డాక్టర్ల పిల్లలు మెడిసిన్ చదివితే తప్పులేదు గానీ నాయకుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని అడిగారు. సమాజ్‌వాదీ కుటుంబ రాజకీయాల్లో భాగంగా ఆమె తన మామగారు ములాయం సింగ్ యాదవ్, చిన మామగారు శివపాల్ యాదవ్‌లకు గట్టి మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు.. నేతాజీ తన రోల్ మోడల్ అని, బావగారు యూత్ ఐకాన్ అని, శివపాల్ చాచా పార్టీకి వెన్నెముక లాంటివారని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ఏకం చేయడానికి కోడలిగా తాను చేయగలిగినంత చేశానని, ఇప్పుడు అంతా ఒక్కటయ్యారు కాబట్టి ఇక బాధలేదని అన్నారు.
మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణా యాదవ్.. లక్నోలో ఫేమస్ అయిన లారెటో కాన్వెంట్‌లో చదివి, తర్వాత ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ ఆనర్స్ చేశారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాల్లో పీజీ చేశారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె.. తరచు స్టేజి మీద కూడా ప్రదర్శనలు వచ్చేవారు. ఐదేళ్ల క్రితం ములాయం చిన్నకొడుకు ప్రతీక్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. అతడికి రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో అపర్ణను బరిలోకి దించాలని ములాయం రెండోభార్య సాధన పట్టుబట్టారు. దాంతో చిన్నకోడలు బరిలోకి దిగాల్సి వచ్చింది.
Advertisement
Advertisement