ములాయం చిన్న కోడలి సంపదెంతో తెలుసా!?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన సంగతి తెలిసిందే. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆమె మూడో దఫా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. సోమవారం ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. తనకు, తన భర్త ప్రతీక్ యాదవ్‌కు మొత్తం రూ. 22.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
తమ ఆస్తుల్లో రూ. 5.23 కోట్లు విలువచేసే అత్యంత ఖరీదైన లాంబోర్గినీ వాహనం కూడా ఉందని వెల్లడించారు. ఇది తన భర్త పేరిట ఉందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనం లేదని పేర్కొన్నారు. తనకు రూ. 1.88 కోట్ల విలువచేసే నగలు ఉన్నాయని తెలిపారు. ఇక తన భర్త ప్రతీక్ రూ. 4.5 కోట్ల రుణాన్ని గోమతినగర్‌కు చెందిన యూనియన్ బ్యాంక్ ఇండియా శాఖ నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. తన పేరిట ఎలాంటి పెట్టుబడులు, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు లేవని, కానీ తన భర్త రూ. 7.96 లక్షల విలువచేసే బీమా పాలసీలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి దంపతులిరువురు ఆదాయపన్ను చెల్లించినట్టు తెలిపారు.
ఎస్పీలో తలెత్తిన ములాయం అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఆమె ఈసారి బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఇక్కడి పోటీపైనే నెలకొని ఉంది.