యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు.
తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.